సీఎన్ జీ షార్టేజ్.. సిటీలోని ఫిల్లింగ్ స్టేషన్లలో వాహనాల క్యూ

సీఎన్ జీ షార్టేజ్.. సిటీలోని ఫిల్లింగ్ స్టేషన్లలో వాహనాల క్యూ
  • రోజుకు 2 లక్షల కిలో లీటర్లు అవసరం
  •  95వేల కిలోలే సరఫరా  చేస్తున్న గ్యాస్ కంపెనీలు
  • 6 నెలలుగా సమస్య ఉందంటున్న వాహనదారులు  
  •  రోజురోజుకు పెరిగిపోతున్న సీఎన్ జీ వాహనాలు
  • సిటీ వ్యాప్తంగా 80 సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్లు మాత్రమే

హైదరాబాద్, వెలుగు: సిటీలో రోజురోజుకు సీఎన్ జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) వాహనాలు పెరుగుతుండగా.. గ్యాస్ కు షార్టేజ్ ఏర్పడుతుంది. డిమాండ్ కు సరిపడా కంపెనీలు సప్లై చేయలేకపోతుండగా..  వాహనదారులు గ్యాస్ కొరత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సిటీలో  డైలీ 2లక్షల కిలో లీటర్ల సీఎన్​జీకి డిమాండ్ ఉంది. కేవలం 95వేల కిలో లీటర్లు మాత్రమే సరఫరా అవుతుంది.  దీంతో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద నిత్యం కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. గంటల కొద్దీ వెయిట్ చేసినా దొరక్కపోతుండగా వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం భాగ్యనగర్, మేఘా, టోరెంట్ కంపెనీలు సీఎన్​జీని సరఫరా చేస్తున్నాయి.

ఇందులో భాగ్యనగర్ గ్యాస్  సిటీలోని 80 ఫిల్లింగ్ స్టేషన్లు, శివారు ప్రాంతాల్లోని 8  స్టేషన్లు, మిగతా జిల్లాల్లో మేఘా కంపెనీ, నాలుగు జిల్లాల్లో టోరెంట్ కంపెనీలు సీఎన్ జీని సరఫరా చేస్తున్నాయి.   ప్రధానంగా  కోర్ సిటీలోనే షార్టేజ్ ఎక్కువగా ఉంది. దీంతో సీఎన్​జీ కార్లను కూడా పెట్రోల్ తోనే నడుపుతున్న పరిస్థితి నెలకొంది. భాగ్యనగర్ గ్యాస్ కు 80 వరకు ఔట్ లెట్లు ఉండగా.. శామీర్ పేట్, అల్విన్ ఎక్స్ రోడ్, హఫీజ్ పేట్ లో లోడింగ్ పాయింట్లు ఉన్నాయి.  ఆయా పాయింట్ల నుంచే సిటీలోని ఫిల్లింగ్ స్టేషన్లకు 50 ఎల్ సీవీ(లైట్ కమర్షియల్ వెహికల్)తో సరఫరా చేస్తుంది. ఇలా ఎల్ సీవీల సంఖ్య తక్కువగా ఉండటంతోనే డిమాండ్ కు సరిపడా సప్లై కావడంలేదు. 

3 లక్షలకు పైగా వాహనాలు 

సిటీలో వాహనాల సంఖ్య కోటి దాటిపోయింది. ఇందులో ఆటోలు, క్యాబ్‌లు 3 లక్షలకుపైగా సీఎన్జీ వాహనాలు ఉన్నాయి.  వీటిలో పెట్రోల్​తో పాటు  సీఎన్‌జీని వాడుతుంటారు.  ప్రస్తుతం డీజిల్​లీటర్ కు రూ.97.82 ఉండగా,  పెట్రోల్ లీటర్ కు రూ.109.66 గా ఉంది. సీఎన్​జీ కిలో లీటర్ కు రూ.96 గా ఉంది. పెట్రోల్​, డీజిల్​రేట్లపై డైలీ రివ్యూ అయితుండగా  గ్యాస్​ రేట్లపై కావడంలేదు. 15 రోజులు, నెలకు ఓ సారి సమీక్ష జరుగుతుంది. కేంద్రం.. పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతూ తగ్గిస్తుండగా.. వెహికల్ గ్యాస్​ ధరలు మాత్రం అలాగే ఉంటున్నాయి. 

అధిక మైలేజీతోనే డిమాండ్‌

పెట్రోల్, డీజిల్‌ కంటే సీఎన్‌జీనే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దీంతో  సీఎన్ జీ ధర పెరిగినా డిమాండ్‌ మాత్రం తగ్గడంలేదు.  ఒక్కోఫిల్లింగ్​స్టేషన్‌ లో ప్రతిరోజు  సీఎన్​సీ 1,200 నుంచి 2 వేల కిలో లీటర్లు సేల్స్​అవుతుంది.  డిమాండ్​ కు సరిపడా గ్యాస్​ సప్లయ్​ కావడంలేదని ఫిల్లింగ్​స్టేషన్ నిర్వాహకులు కూడా చెబుతున్నారు. ఒక్కో సందర్భంలో స్టాక్​ లేకపోవడంతో పంప్​ మూసి వేయాల్సి వస్తుందని అంటున్నారు. 

పైపులైన్లు ఉండగా..

బాలానగర్, చింతల్, పేట్ బషీరాబాద్, మేడ్చల్, అల్విన్ ఎక్స్ రోడ్ ఫిల్లింగ్ స్టేషన్లకు పైపులైన్లు ఉండగా ..  ఇక్కడ పైపులైన్ల నుంచి నేరుగా వెహికల్స్ లోకి గ్యాస్ ఫిల్ చేయవచ్చు. ఎప్పుడు స్టాక్ అయిపోయే పరిస్థితి ఉండదు. దీంతో వాహనదారులు ఇక్కడికే క్యూ కడుతుండగా.. కొన్నిచోట్ల కిలోమీటర్ మేర ఉంటున్నాయి.   ఇక్కడ డిస్పెన్సర్ల సంఖ్య పెంచేతే వాహనదారులకు గ్యాస్ తిప్పలు తీరే అవకాశముంది. భాగ్యనగర్ గ్యాస్ కంపెనీకి చెందిన ఔట్ లెట్ ఎల్​బీనగర్ లో ఉండగా భారీగా క్యూలైన్ ఉంటుంది. బాలానగర్ నుంచి ఈసీఐఎల్ కు గ్యాస్ పైపులైన్ టెండర్లు జరిగి మూడేళ్లు దాటినా పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. 

వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నం 

సీఎన్ జీ కోసం గంటల కొద్దీ ఎదురుచూస్తున్నా. క్యూలైన్లు తక్కువగా ఉంటున్నాయని సిటీ శివారుకు వెళ్తున్నా. సిటీలో చాలా ఇబ్బందిగా ఉంది. చాలా స్టేషన్లలో ఎప్పుడూ నో స్టాక్ అని ఉంటుంది. దీంతో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నం. ఎక్కడ స్టాక్ ఉంటుందో తెలుసుకుంటున్నం. వెంటనే అక్కడికి వెళ్తున్నం. సీఎన్ జీ ఇబ్బందులు లేకుండా చూస్తే బాగుంటుంది.

 సిద్దా రెడ్డి, క్యాబ్ డ్రైవర్