
- పొడగింపు ప్రసక్తే లేదు
- బీఐఎస్ చీఫ్ప్రమోద్ కుమార్ తివారీ
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, బ్రెయిన్ కంప్యూటింగ్ ఇంటర్ఫేజ్, బిగ్ డేటా ఎనలిటిక్స్సహా ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలకు సైతం స్టాండర్డ్స్తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చీఫ్ ప్రమోద్‌కుమార్ తివారి వెల్లడించారు.ఈ రంగాలలో మన దేశం అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఐఎస్ఓ తరహాలోనే ఈ కొత్త స్టాండర్డ్స్ ఉంటాయని ఆయన వివరించారు. హాల్మార్క్డ్ గోల్డ్ జ్యుయెలరీకి ఆరంకెల హెచ్‌యూఐడీ తప్పనిసరనే నిబంధన గడువును పెంచబోమని హాల్‌మార్క్‌తో కూడిన బంగారు ఆభరణాలకు ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను తప్పనిసరిగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని బీఐఎస్ ఇంతకు ముందే ఆదేశించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంపొందించేందుకే స్టాండర్డ్స్ తెస్తున్నామని, దేశంలో పాటిస్తున్న స్టాండర్డ్స్‌ను అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో అనుసంధానం చేస్తున్నామని బీఐఎస్ చీఫ్ వెల్లడించారు. దీనివల్ల విదేశాలతో వ్యాపారం చేయడం సులభమవుతుందని పేర్కొన్నారు.
మొత్తం 22 వేల స్టాండర్డ్స్..
బీఐఎస్ తెచ్చిన 22 వేల స్టాండర్డ్స్‌లో 8 వేల స్టాండర్డ్స్ ఇప్పటికే గ్లోబల్ స్టాండర్డ్స్‌తో అనుసంధానమయ్యాయని, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌లో ఐఈసీ, నాన్–ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌లో ఐఎస్ఓ వంటివి ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయని తివారీ పేర్కొన్నారు. 88 శాతం బీఐఎస్ స్టాండర్డ్స్ గ్లోబల్స్టాండర్డ్స్కు అనుగుణమైనవేనని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
హెచ్‌యూఐడీ సాయంతో నగలను ట్రేస్ చేయొచ్చు..
బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్తోపాటు, ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) ఏప్రిల్1 నుంచి తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, ఈ గడువును పెంచే ప్రసక్తే లేదని తివారీ స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న పాత స్టాక్స్‌ను క్లియర్ చేసుకోవడానికి జ్యుయెలర్లకు రెండేళ్లు టైము ఇచ్చామని, ఈ గడువును ఇకపై పొడగించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆరంకెల హెచ్‌యూఐడీ అమలుపై ఇటీవలే జ్యుయెలరీ అసోసియేషన్‌తో సమావేశమయ్యాయని, వారికి దాని ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేశామని కూడా తివారీ ఈ సందర్భంగా చెప్పారు. జ్యుయెలర్లు ఇచ్చిన సలహా మేరకు గోల్డ్జ్యుయెలరీ బరువును కూడా హాల్‌మార్క్‌లో భాగం చేయనున్నట్లు వెల్లడించారు. ఎసేయింగ్ సెంటర్లలో హాల్‌మార్కింగ్ కోసం లేజర్ మెషీన్లు వాడుతున్నారని, వాటిని బీఐఎస్ సిస్టమ్‌తో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. డూప్లికేట్ సీల్ హెచ్‌యూఐడీ మార్కుతో కస్టమర్లను మోసగించడానికి వీలు లేకుండా చేయడానికే ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 1,400 ఎసేయింగ్ సెంటర్లున్నాయని తివారీ చెప్పారు. బంగారపు స్వచ్ఛత ఎంతో తెలియచేయడం కోసం ఇచ్చేదే హాల్‌మార్కింగ్. 16 జూన్, 2021 దాకా ఈ హాల్‌మార్కింగ్ వాలంటరీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత జులై 1, 2021 నుంచి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ బీఐస్ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి హెచ్‌యూఐడీ లేకపోయినా హాల్‌మార్కింగ్‌తో కూడిన జ్యుయెలరీని అమ్ముకోవడానికి ఇప్పటిదాకా అనుమతి ఇచ్చామని తివారీ వివరించారు. హెచ్‌యూఐడీ అమలులోకి వచ్చాక, హాల్‌మార్కింగ్‌లో మూడు రకాల మార్కింగ్‌లు ఉంటాయి. ఒకటి బీఐఎస్ లోగో, రెండు ఆభరణపు స్వచ్ఛత, మూడోది ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్ హచ్యూఐడీ. ప్రతీ బంగారు ఆభరణానికీ ఒక యూనిక్ హెచ్‌యూఐడీ నెంబర్ ఉంటుందన్నమాట. ఈ నెంబర్ సాయంతో ట్రేస్ చేయడం వీలవుతుంది.