బంగారానికి డిమాండ్​ తగ్గింది.. అందుకే రేటు కూడా ఒకేసారి ఇంత పడిపోయింది..!

బంగారానికి డిమాండ్​ తగ్గింది.. అందుకే రేటు కూడా ఒకేసారి ఇంత పడిపోయింది..!

న్యూఢిల్లీ: చైనా దిగుమతులపై అమెరికా 90 రోజుల టారిఫ్​ విరామం ప్రకటించడంతో బంగారానికి డిమాండ్​ తగ్గింది. దేశ రాజధానిలో సోమవారం బంగారం ధర రూ. 3,400 తగ్గి రూ. 96,550కి పడిపోయింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన  బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,400 తగ్గి రూ. 96,100కి చేరుకుంది. గత జులై 23, 2024న బంగారం ధర  రూ. 3,350 పడిపోయింది. అప్పటి నుంచి 10 నెలల్లో ఇది అత్యంత భారీ పతనం.

99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం శనివారం 10 గ్రాములకు రూ. 99,950 వద్ద,   99.5 శాతం  స్వచ్ఛత గల పుత్తడి ధర రూ. 99,500 వద్ద స్థిరపడింది. "అమెరికా,  చైనా మధ్య వాణిజ్య చర్చలలో పురోగతి కనిపిస్తోంది. దీనికితోడు భారతదేశం, -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలలో కొంత ఉపశమనంతో బంగారం ధరలు బాగా తగ్గాయి" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లోని కమోడిటీస్ ఎనలిస్ట్​ రాహుల్ కలాంత్రి అన్నారు.

వెండి ధర శనివారం కిలోకు రూ. 99,900 వద్ద ముగిసింది.  సోమవారం దీని ధర రూ. 200 తగ్గి రూ. 99,700కి చేరుకుంది.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ. 3,932 తగ్గి రూ. 92,586 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ బంగారం ధర 3 శాతం పైగా తగ్గి ఔన్సుకు (28.3 గ్రాములు)  3,218.70 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ వెండి ధర1.19 శాతం తగ్గి ఔన్సుకు  32.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.