Sensex Rally: మార్కెట్లలో బుల్స్ ఆధిపత్యం.. రూ.15 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

Sensex Rally: మార్కెట్లలో బుల్స్ ఆధిపత్యం.. రూ.15 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

Bull Rally: గతవారం యుద్ధ వాతావరణం అలుముకోవటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే కొత్తవారం పరిస్థితులు పూర్తిగా మారిపోవటంతో సూచీలు భారీగా పెరిగాయి. ప్రధానంగా పాకిస్థాన్-ఇండియాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరటంతో పాటు మరో పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా రంగంపై చేసిన ప్రకటన మార్కెట్లను వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగేలా చేశాయి.

సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2వేల 975 పాయింట్లు లాభంతో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 917 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ వెయ్యి 787 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2వేల 192 పాయింట్లు పెరుగుదలను చూసింది. దీంతో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

ALSO READ | ఇన్వెస్టర్లకు కీలక సీక్రెట్ చెప్పిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ సీఈవో.. ఇలా చేస్తే లాభాలే..!!

మార్కెట్ల మెగా ర్యాలీ సమయంలో నేడు ఇన్వెస్టర్ల సంపద విలువ దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర పెరిగినట్లు వెల్లడైంది. నేడు ఇంట్రాడేలో ఆటో, ఐటీ, ఫార్మా రంగాలకు సంబంధించిన షేర్లకు మంచి గిరాకీ కనిపించింది. ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే అంశాలు ఒక్కొక్కటిగా కనుమరుగవటంతో ఇన్వెస్టర్లలో కొత్త జోష్ కొనసాగుతోంది.

ఇదే క్రమంలో భారతదేశంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అత్యంత చేరువకు రావటం కూడా మార్కెట్లలో ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని నింపుతోంది. దీనికి అనుగుణంగా గడచిన 15 ట్రేడింగ్ సెషన్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నికర కొనుగోలుదారులుగా నిలుస్తూ పెట్టుబడులు పెట్టడం బుల్స్ జోరును మరింతగా పెంచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. నేడు ప్రధానంగా ఐటీ, పవర్, రియల్టీ, ఎనర్జీ రంగాలకు చెందిన స్టాక్స్ 4 నుంచి 6 శాతం మేర లాభపడ్డాయి.