బట్టలు లేవు, ఇంటి తిండి లేదు.. బిచ్చగాళ్లలా జీవిస్తున్నాం.. బెంగాల్ లో అభ్యర్థుల వెతలు

బట్టలు లేవు, ఇంటి తిండి లేదు.. బిచ్చగాళ్లలా జీవిస్తున్నాం.. బెంగాల్ లో అభ్యర్థుల వెతలు

జూలై 8న జరగనున్న పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బరాయ్‌పూర్‌లోని బీజేపీ కార్యాలయం 'సేఫ్ హౌస్'గా మార్చబడింది. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని తమ కుటుంబాలను టీఎంసీ బెదిరిస్తోందని, ఫలితంగా తాము ఇంటికి దూరంగా బతకాల్సి వస్తోందని కొందరు అంటున్నారు.

కోల్‌కతా నుంచి 40 నిమిషాల ప్రయాణ సమయం పట్టే బరైపూర్ లో బీజేపీ కార్యాలయం ఉంది. లోపలికి వెళ్ళగానే ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత గది మాత్రం చిందరవందరగా ఉన్న బట్టలు, ఉపయోగించిన పాత్రలతో నిండిపోయి కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు జరిగిన హింస వల్లే ఈ వాతావరణం చోటు చేసుకుందని బీజేపీ వాదిస్తోంది.  "వాస్తవం మీకందరికీ తెలుసు. టీఎంసీ గూండాలు మాపై విరుచుకుపడ్డారు. పంచాయితీ ఎన్నికలలో పాల్గొనే వారిని మేము రక్షించుకోవాలి”ఈ సందర్భంగా బరైపూర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్ కర్ చెప్పారు.

హిల్లో పాత్ర అనే బీజేపీ అభ్యర్థి ఇప్పుడు సేఫ్ హౌజ్ గా పిలిచే బీజేపీ కార్యాలయంలో నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు 2023 కోసం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసినప్పటి నుంచి పాత్రా ఇంటికి దూరంగా ఉన్నారు. 'నన్ను పోటీ చేయనివ్వవద్దని నా కుటుంబసభ్యులకు చెప్పారు. కానీ నేను పోటీలో ఉన్నాను. నా కుటుంబం నా గురించి భయపడుతోంది. కానీ నేను వారికి దూరంగా ఉండి ఇక్కడ నివసించాలని నిర్ణయించుకున్నాను. నా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చేందుకు టీఎంసీ నేతలు ఇంటికి వస్తున్నారు. నేను ఓడిపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అప్పుడు నా ప్రాంతంలోని టీఎంసీ నేతలు ఇంకా ధైర్యంగా ఉంటారు. అందుకే నేను ఇంకా పోటీ చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను”అని పాత్ర చెప్పుకొచ్చారు.

ఇంటికి, కుటుంబానికి దూరంగా 'సురక్షిత గృహం'లో నివసిస్తున్న మరో బీజేపీ అభ్యర్థి గౌతమ్ నష్కర్ పాత్రతో ఏకీభవించారు.“అవును, రాజకీయాల్లో మనం భయపడకూడదు. నేను ఇక్కడ ఒక బిచ్చగాడిలా జీవిస్తున్నాను. బట్టలు లేవు, ఇంటి తిండి లేదు. మాలో చాలా మంది ఒకే గదిలో, ఒకే మంచంలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇదే నిబద్ధతకు నిదర్శనం”అని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం 63 వేల 229 గ్రామ పంచాయతీ స్థానాలు ఉన్నాయి. టీఎంసీ 85 వేల 817 మంది అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 56 వేల 321 మంది అభ్యర్థులను నిలబెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమీపిస్తున్న క్రమంలో స్థానిక ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. బీజేపీ, లెఫ్ట్-కాంగ్రెస్ లు ఎన్నికల ముందు తలెత్తిన హింస, అవినీతి ఆరోపణలు చివరికి 2024 ఎన్నికలలో రాష్ట్రంలో టీఎంసీని అధిగమించడానికి ఒక కారకంగా మారుతాయని పలువురు ఆశిస్తున్నారు.