యూట్యూబే ఆమె కోచ్​

యూట్యూబే  ఆమె కోచ్​

‘ఒలింపిక్స్​ పతకం నా కల’ అంటున్న ఆమె పేరు పాయం కుమారి
భద్రాచలం డివిజన్​ దుమ్ముగూడెం మండలంలోని  కోయనర్సాపురం ఆమెది

తాటాకులు, తడకలతో అల్లిన గుడిసెనే ఇల్లు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రోజూ పనికి వెళ్తే తప్ప కడుపు నిండని పేద కుటుంబం. దాంతో, చదువుకుంటూనే సెలవు రోజుల్లో అమ్మానాన్నతో కలిసి కూలీ పనులకు వెళ్లేది. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఎమర్జింగ్​ అథ్లెట్.​ పి.టి.ఉష బయోగ్రఫీ చదివి తను కూడా ఆమెలా దేశం గర్వించే  స్థాయికి చేరుకోవాలనుకుంది. అనుకోవడమే కాదు పరుగు పందెంలో సత్తా చాటుతోంది. ఈమధ్యే  ఇండో– నేపాల్​ ఇంటర్నేషనల్​ ‍ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం గెలిచింది.


కుమారి అమ్మానాన్నలు పాయం ముద్దరాజు, వీరమ్మ.  కుమారి చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేది. సొంతూరిలో ఐదో క్లాస్​ వరకు చదివింది. తర్వాత ఆరో క్లాస్​ కోసం దుమ్ముగూడెంలోని కస్తూర్బా స్కూల్లో చేరింది. అక్కడ  పీఈటీ మేడం అన్నపూర్ణ  సాయంతో  ఖోఖో, కబడ్డీ ఆటల్లో మెలకువలు నేర్చుకుంది. అంతేకాదు ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్​ ట్రైబల్ డెవలప్​మెంట్​ ఏజెన్సీ) స్థాయిలో జరిగే ఆటల పోటీల్లో ప్రతిభ చాటింది. అయితే, కుమారి లైఫ్​ టర్న్​ అయింది మాత్రం డిగ్రీ కోసం ఖమ్మంలోని గురుకుల కాలేజీలో చేరిన తర్వాతే. డిగ్రీ ఫస్ట్​ ఇయర్​లో పీటీ ఉష బయోగ్రఫీ చదివి ఇన్​స్పైర్​ అయింది కుమారి. ‘ఆమెలా నేను దేశానికి ఎందుకు ఆడకూడదు?’ అనుకుంది. అప్పటినుంచి రన్నింగ్​ మీద ఫోకస్​ పెట్టింది.  యూట్యూబ్​లో వీడియోలు చూసి కాలేజీలో పీడి మేడమ్​ల సాయంతో  రన్నింగ్​లో మెలకువలు నేర్చుకుంది కుమారి.  అయితే, డబ్బులు లేకపోవడంతో కోచ్​ దగ్గర ట్రైనింగ్​ తీసుకోలేకపోయింది.  గూగుల్​లో, యూట్యూబ్​లో పరుగు పందేల వీడియోలు చూసి, ఒక అథ్లెట్ ఎలా ఉండాలనేది తెలుసుకుంది. ఐదు, పది కిలోమీటర్ల పరుగుపై దృష్టి పెట్టింది. అందుకు తగ్గట్టుగా పరిగెత్తే వేగాన్ని పెంచుకుంది. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్కడికి వెళ్లినా పతకాలతో తిరిగొచ్చేది.  గోవాలో జరిగిన నేషనల్‍గేమ్స్​లో5 కిలోమీటర్లు,10 కిలోమీటర్ల  పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకుంది. కుమారి డిగ్రీ సెకండియర్‍ చదువుతున్నప్పుడు అండర్‍-–21యూత్ నేషనల్‍సెలక్షన్స్ జరిగాయి. అయితే, కరోనా​ కారణంగా ఇండో–నేపాల్‍-2020 ఇంటర్నేషనల్ ఛాంపియన్​షిప్​ రెండేండ్లు వాయిదా పడింది. దాంతో ఈసారి కుమారికి ఛాన్స్​ వచ్చింది. ఆ పోటీల్లో గోల్డ్​ మెడల్​ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాదులోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో కోచ్​ శ్రీనివాస్‍ దగ్గర  ట్రైనింగ్ తీసుకుంది. అనుకున్నట్టుగానే ఈ ఏడాది జనవరి 18న  నేపాల్​లో జరిగిన10కిలో మీటర్ల పరుగు పందెంలో కుమారి ఫస్ట్ వచ్చింది. బంగారు పతకం గెలిచి, ఒలింపిక్స్​ సెలక్టర్ల దృష్టిలో పడింది. ప్రస్తుతం ఎంఏ(పొలిటికల్‍సైన్స్) ఫస్ట్​ ఇయర్‍ చదువుతోంది కుమారి.
                                                                                                                                                                                       ::: మొబగాపు ఆనంద్‍కుమార్, భద్రాచలం, వెలుగు


2024 ఒలింపిక్స్ టార్గెట్‍
“ హైదరాబాదులోని   స్పోర్ట్స్ అథారిటీలో ట్రైనింగ్​ తీసుకుంటున్నా. 2024 ఒలింపిక్స్​కు సెలక్ట్ అవుతానని నమ్మకం ఉంది. ఒలింపిక్స్​లో దేశానికి బంగారు పతకం అందించడమే నా టార్గెట్. పి.టి. ఉష నాకు ఇన్​స్పిరేషన్​. ఆమెలా పేరు తెచ్చుకోవాలి’’.