- పెద్దపల్లి జిల్లాలోక్రాప్ లోన్ కట్టాలంటూ పంపిన బ్యాంకులు
- గడువు లోపు కట్టకుంటే సివిల్, క్రిమినల్ కేసులు
- రూ.లక్ష లోపు లోన్ల మాఫీ హామీ పట్టని సర్కారు
- నోటీసులతో ఆందోళన చెందుతున్న రైతులు
పెద్దపల్లి, వెలుగు: క్రాప్ లోన్ తీసుకుని కట్టని రైతులకు బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎస్‌బీఐ బ్రాంచ్.. 164 మందికి లీగల్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో లోన్ క్లియర్ చేయకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని పేర్కొంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వానలు, తెగుళ్ల వల్ల నష్టపోయామని, ఇప్పటికిప్పుడు కట్టాలంటే పైసలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. రూ.లక్ష లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని ఎన్నికల టైమ్‌లో కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో రుణాలు మాఫీ అవుతాయని అనుకున్న రైతులు.. బ్యాంకులకు చెల్లించలేదు. కానీ నాలుగేళ్లుగా రుణాలు మాఫీ కాలేదు. ఈ క్రమంలో రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వెళ్తున్నాయి.
రెండేండ్లయినా పట్టించుకోలే..
2018 డిసెంబర్ 11ను కటాఫ్ తేదీగా నిర్ణయించిన సర్కారు.. అప్పటిలోగా క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు వడ్డీ, అసలు కలిపి రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపింది. ప్రభుత్వం 2020లో మొదటగా రూ. 25 వేలు ఉన్న వారి లోన్స్ మాఫీ చేస్తామని చెప్పింది. తర్వాత రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ఆ ప్రక్రియ రెండేండ్లయినా పూర్తి కాలేదు. రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు లోన్స్ తీసుకున్న వారు 6 లక్షల మందికి పైగా రైతులున్నట్లు లెక్కలు తేల్చారు. రాష్ట్ర సర్కారు రుణమాఫీ అమలు చేయకపోవడంతో సుమారు 16 లక్షల మంది రైతులను డిఫాల్టర్లుగా పరిగణిస్తున్నారు. బ్యాంకర్లు అఫీషియల్‌గా ప్రకటించకున్నా.. క్రాప్ లోన్స్ చెల్లించనివాళ్లను, కనీసం వడ్డీ కట్టి రెన్యువల్చేసుకోనివాళ్లను టెక్నికల్‌గా ఎగవేతదారులుగానే చూస్తున్నారు. కొత్తగా క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు. సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పుడు నోటీసులు ఇచ్చే దాకా పరిస్థితి వచ్చింది.
భయపెట్టి వసూలు చేయాలని చూస్తున్రు
రైతులను నోటీసుల పేరుతో భయపెట్టి పైసలు వసూలు చేయాలని బ్యాంకర్లు చూస్తున్నరు. సీఎం చెప్పినట్లు రుణమాఫీ చేయాలి. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలి.
- రాజలింగం,
రైతు, రామగుండం, పెద్దపల్లి జిల్లా
సచ్చుడే తప్ప వేరే దారి లేదు
2017లో రూ.లక్ష లోన్ తీసుకున్న. లక్ష రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల ముందు సీఎం చెప్పిండు. దాంతో బ్యాంకుకు పైసలు కట్టలేదు. ఇప్పుడేమో బ్యాంకు వాళ్లు లీగల్ నోటీసు పంపిన్రు. లక్ష మీద వడ్డీ వేసి మొత్తం కట్టాలంటున్నరు. 15 రోజుల్లో పైసలు కట్టకపోతే కేసు పెడ్తమని నోటీసుల ఉన్నది. ఒత్తిడి చేస్తే సచ్చుడే తప్ప దారి లేదు.
- దొమ్మటి తిరుపతి, మొట్లపల్లి, పెద్దపల్లి జిల్లా
