
జూలై నెలలో కదులుతున్న రైలులో తన సీనియర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ను సర్వీసు నుండి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 14న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సింగ్‌ను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. సింగ్ గతంలో కనీసం మూడు క్రమశిక్షణకు సంబంధిత సంఘటనలలోనూ పాత్రుడైనట్టు వెల్లడించారు.
జూలై 31 తెల్లవారుజామున జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై శివార్లలోని పాల్ఘర్ స్టేషన్‌కు సమీపంలో సింగ్ (34) తన సీనియర్ అధికారి టికారమ్ మీనాతో పాటు ముగ్గురు ప్రయాణీకులను రివాల్వర్ తో కాల్చి చంపేశాడు. చనిపోయిన వారిలో ముగ్గురు ప్రయాణికులు అబ్దుల్ కాదర్ మహ్మద్ హుస్సేన్ భాన్‌పురావాలా, సయ్యద్ సైఫుద్దీన్, అస్గర్ అబ్బాస్ షేక్‌లు రైలులోని వేర్వేరు బోగీల్లో ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత సింగ్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) అరెస్టు చేశారు. కాగా ఈ నేరం వెనుక ఉద్దేశం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
సింగ్ మొదట RPF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మీనా, B5 కోచ్‌లోని ఒక ప్రయాణికుడిని తన ఆటోమేటిక్ సర్వీస్ వెపన్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను రైలులోని ప్యాంట్రీ కారులో మరొక ప్రయాణికుడిని, S6 కోచ్‌లోని మరో ప్రయాణికుడిని కాల్చి చంపాడు. సింగ్ ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని అధికారులు తెలిపారు.