కుల గణన దేశానికే ఆదర్శం : రేణుకా చౌదరి

కుల గణన దేశానికే ఆదర్శం : రేణుకా చౌదరి
  • రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

ఖమ్మం టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కులగణన యావత్ దేశానికే ఆదర్శమని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు దక్కాయని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. సోమవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పిండాలు మాకు పెట్టడం కాదని.. కేసీఆర్, కేటీఆర్ లకు పెట్టాలని ఆమె మండిపడ్డారు. బీఆర్‌‌ఎస్ కు చెందిన మాజీ మంత్రులకు పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 

బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చూస్తూ కూర్చున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు తోకను బీజేపీ వాళ్లు త్వరలోనే కట్ చేస్తారని ఎద్దేవా చేశారు.  గోదావరి, కృష్ణా నది జలాల పంపకాలు సక్రమంగా జరగాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోందని అన్నారు.   ఎంతమంది మంత్రులు ఉన్నా ఆడబిడ్డగా జిల్లాను వదిలేది లేదని స్పష్టం చేశారు.  కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నందు వల్లే పార్లమెంట్ సెషన్స్ నిర్వహించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే మట్ట రాగమయి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.