
బెంగళూరు : ఐపీఎల్17లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్తులు సొంతం చేసుకున్నాయి. మిగిలిన నాలుగో బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో నాలుగో బెర్తు ఎవరిదో తేలనుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న సీఎస్కే (0.528 రన్‌రేట్) ఈ పోరులో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ (0.387 రన్‌రేట్) గెలిస్తే చెన్నైతో పాటు ఆ జట్టు 14 పాయింట్లతో నిలుస్తుంది. రన్‌రేట్ ఎక్కువ ఉన్న జట్టు ముందుకెళ్తుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ విజయంపై కన్నేసింది.
తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు ఓటముల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు సొంతగడ్డపై అదరగొట్టి ప్లే ఆఫ్స్ చేరాలని ఆశిస్తోంది. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజ్ సిస్టమ్ ఉండటంతో వర్షం అంతరాయం కలిగించినా మ్యాచ్ జరుగుతుందని ఆటగాళ్లు, అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆట రద్దయితే మాత్రం సీఎస్కే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.