హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు

హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
  • గ్రేటర్​ హైదరాబాద్​ అభివృద్ధిపై రాష్ట్ర​ సర్కారు స్పెషల్​ ఫోకస్
  • ఓఆర్ఆర్​, ట్రిపుల్​ఆర్ ​నడుమ ఇండస్ట్రియల్, ఎకనామిక్​ కారిడార్ల ఏర్పాటుకు రోడ్​మ్యాప్
  • మెట్రో విస్తరణ, ఎలివేటెడ్​ కారిడార్లు, మూసీ ప్రక్షాళన పనులతో పాజిటివ్​ వేవ్స్​ 
  • డిసెంబర్ నుంచి దూసుకెళ్తున్న రియల్​ ఎస్టేట్​
  • ఫిబ్రవరిలో రూ.920 కోట్ల రికార్డు ఆదాయం
  • ఆనరాక్, నైట్​ ఫ్రాంక్​ రిపోర్టుల్లోనూ సిటీనే టాప్​
  • అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీల్లో నగరానికి నాలుగో స్థానం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​, దాని చుట్టుపక్కల జిల్లాల్లో రియల్​ఎస్టేట్​ జోరందుకున్నది. గడిచిన నాలుగు నెలలుగా ఓపెన్​ ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలలో స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆ ఏడాదిలోనే అత్యధికంగా రూ.918 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరిలో కాస్త జోరు తగ్గినట్టు కనిపించినా, ఫిబ్రవరిలో మరింత స్పీడ్​ అందుకుంది. దీంతో రెవెన్యూ శాఖకు రూ.920 కోట్ల రికార్డు ఆదాయం వచ్చింది. 

అటు ఇండ్ల అమ్మకాల్లోనూ గ్రేటర్ ​హైదరాబాద్​దేశంలోని 7 ప్రధాన నగరాల్లో టాప్​లో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి -మార్చి వరకు 38 శాతం వృద్ధి నమోదు చేసినట్లు మార్చి నెలాఖరులో అనరాక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్​లో రియల్​ ఎస్టేట్ మరింత పుంజుకుంటుందని ఇటీవల నైట్​ ఫ్రాంక్ సంస్థ కూడా  ఒక నివేదికను ప్రకటించింది.  

కొత్త సర్కారు స్పెషల్​ ఫోకస్ 

డిసెంబర్​7న రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు కొలువుదీరింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే తమ ప్రథమ లక్ష్యమని ప్రకటించిన సీఎం రేవంత్​రెడ్డి, డిసెంబర్​18న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులతో కలిసి హైలెవల్​ మీటింగ్ ​నిర్వహించారు. రీజినల్​రింగ్​ రోడ్డును ఫస్ట్​ ప్రయారిటీ కింద పూర్తిచేయాలని ఆఫీసర్లను ఆదేశించిన ఆయన,  ఓఆర్ఆర్​, ట్రిపుల్​ఆర్​నడుమ ఇండస్ట్రియల్​, ఎకనామిక్​ కారిడార్ల అభివృద్ధికి రోడ్​మ్యాప్​ఆవిష్కరించారు. రీజినల్ రింగ్ రోడ్  లోపల 500 నుంచి వెయ్యి ఎకరాల భూములు గుర్తించి,  హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడలను తరలించే ప్లాన్​పై చర్చించారు.

కొత్త మాస్టర్‌‌ ప్లాన్లు తెస్తామని, భవన నిర్మాణ అనుమతులను మరింత ఈజీ చేస్తామని  ప్రకటించారు. ఆ తర్వాత మూసీ సుందరీకరణ,  హైదరాబాద్​ మెట్రో విస్తరణ, ఎలివేటెడ్​కారిడార్ల నిర్మాణ పనులకు  శ్రీకారం చుట్టారు. మరోవైపు  సర్కారు ఆదేశాల మేరకు ప్రస్తుతం 7,350 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ పరిధిని మరో 100 చదరపు కిలోమీటర్లు పెంచాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.  ఓఆర్ఆర్​ అవతల పీపీపీ విధానంలో శాటిలైన్​ టౌన్​షిప్​ల నిర్మాణానికి  రెడీ అవుతోంది. తక్కువలో తక్కువ 100 ఎకరాలు ఉండే టౌన్ షిప్ లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించి, విధివిధానాలు రూపొందిస్తోంది. ఇలాంటి సానుకూల పరిణామాల వల్లే హైదరాబాద్​, దాని చుట్టుపక్కల జిల్లాల్లో రియల్​ఎస్టేట్ పుంజుకున్నట్టు రియల్​ నిపుణులు చెప్తున్నారు.

జెట్ ​స్పీడ్​తో అనుమతులు 

మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులను స్పీడప్​ చేయడం కూడా రియల్​ జోరుకు మరో కారణంగా కనిపిస్తోంది.  గడిచిన ఐదు నెలల్లో ఏకంగా 827 భవన నిర్మా ణాలకు ఆఫీసర్లు అనుమతులిచ్చారు. అదే సమయంలో హైరైజ్​బిల్డింగ్స్​, అపార్ట్​మెంట్స్, విల్లాల నిర్మాణం కూడా ఊపందుకున్నది. గడిచిన మూడు నెలల్లో అనుమతుల కోసం హెచ్ఎండీఏకు వస్తున్న  అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిరుడు డిసెంబరు వరకు  హైరైజ్​ భవనాల నిర్మాణం, లే అవుట్లు, వెంచర్లకు సంబంధించి నెలకు 10లోపే దరఖాస్తులు వచ్చేవి. కానీ జనవరి నుంచి ప్రతి నెలా15 నుంచి 20 వరకు అప్లికేషన్లు వస్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో గతంలో రెండు నెలలకోసారి జరిగే మల్టీస్టోర్​డ్​బిల్డింగ్​(ఎంఎస్​బీ) కమిటీ సమావేశాలను ప్రస్తుతం వారానికోసారి నిర్వహిస్తున్నారు.

దేశంలోనే హైదరాబాద్​ టాప్​

ఈ ఏడాది జనవరి నుంచి భూముల అమ్మకాలు, ఇండ్ల విక్రయాల్లో గ్రేటర్​హైదరాబాద్​దూసుకెళ్తోందని ‘ఆనరాక్’ సంస్థ వెల్లడించింది. ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ దేశంలో  టాప్‌‌లో నిలిచినట్టు తన మార్చి నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి -మార్చి వరకు ఇళ్ల విక్రయాలు సగటున14 శాతం వృద్ధి నమోదు చేయగా, హైదరాబాద్​తర్వాతి స్థానంలో ముంబై (24%), పుణె (15%), బెంగళూరు (14%) నిలిచాయని  పేర్కొంది. ఢిల్లీలో 9 శాతం, చెన్నైలో 6 శాతం తగ్గుదల నమోదైనట్టు స్పష్టం చేసింది.  

రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్​లో రియల్​ ఎస్టేట్​మరింత పెరుగుతుందని ఇటీవల ‘నైట్​ ఫ్రాంక్’ సంస్థ కూడా  ఒక నివేదికను ప్రకటించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్​–10 నగరాల జాబితాలో హైదరాబాద్​ నాలుగో స్థానంలో ఉన్నట్టు స్పష్టంచేసింది. సర్కారు నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉండటంతో రాష్ట్రంలో రియల్​ఎస్టేట్ ఊపు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.