76 ఏళ్లలో ఐదుగురే! మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం అంతంతే..

76 ఏళ్లలో ఐదుగురే!  మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం అంతంతే..
  • ఈ ఎన్నికల బరిలో 26 మంది మహిళా అభ్యర్థులు 
  • ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నది నలుగురే

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొదటిసారి 1952, 1957లో ద్విసభ్య స్థానాలకు ఎన్నికలు జరగగా, 1962 నుంచి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1957 ద్విసభ్య ఎన్నికల్లో తేళ్ల లక్ష్మీకాంతమ్మ రెండో అభ్యర్థిగా కాంగ్రెస్​ తరపున ఎన్నికయ్యారు.

1972లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ తరపున దుగ్గినేని వెంకట్రావమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైరా నుంచి సీపీఐ తరపున బానోత్ చంద్రావతి, భద్రాచలం నుంచి కాంగ్రెస్​ తరపున కుంజా సత్యవతి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో ఇల్లందు నుంచి కాంగ్రెస్​ తరపున గెలిచిన బానోతు హరిప్రియ, మరోసారి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

ఈసారి 26 మంది మహిళలు.. 

ఈసారి ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని అన్ని పార్టీల నుంచి కలిపి 26 మంది మహిళలు పోటీ పడుతున్నారు. ఖమ్మంలో ఆరుగురు, సత్తుపల్లిలో ఐదుగురు, భద్రాచలం, ఇల్లందులో నలుగురు చొప్పున, అశ్వారావుపేటలో ముగ్గురు, పాలేరులో ఇద్దరు, పినపాక,  కొత్తగూడెంలో ఒకరి చొప్పున పోటీ చేస్తున్నారు. వైరా, మధిర నియోజకవర్గాల్లో మహిళలెవరూ పోటీలో లేరు. ప్రధాన పార్టీల నుంచి నలుగురికి మాత్రమే టికెట్లు దక్కాయి.

ఇల్లందులో బీఆర్ఎస్​ నుంచి బానోతు హరిప్రియ, సత్తుపల్లిలో కాంగ్రెస్​ నుంచి మట్టా రాగమయి, సీపీఎం నుంచి మాచర్ల భారతి, అశ్వారావుపేటలో జనసేన నుంచి ఎం.ఉమాదేవి పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో మొత్తం 12,16,796 మంది ఓటర్లుండగా, 6,27,553 మంది మహిళలు, 5,89,165 
మంది పురుషులున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 9,66,439 మంది ఓటర్లకు గాను 4,94,650 మంది మహిళలు, 4,71,745 మంది పురుషులున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య  ఎక్కువగా ఉన్నా ఈసారి మొత్తం 229 మంది అభ్యర్థుల్లో మహిళలు 26 మంది మాత్రమే ఉండడం గమనార్హం.