బరి తెగించేశారు : స్వీపర్ కు రూ.4 లక్షలు, క్లర్క్ కు రూ.5 లక్షలు.. లంచాలు ఫిక్స్ చేసి మరీ వసూలు

బరి తెగించేశారు : స్వీపర్ కు రూ.4 లక్షలు, క్లర్క్ కు రూ.5 లక్షలు.. లంచాలు ఫిక్స్ చేసి మరీ వసూలు

లేబర్, స్వీపర్, ప్యూన్, అంబులెన్స్ అటెండర్, డ్రైవర్, మేసన్, శానిటరీ అసిస్టెంట్, డంపర్ ఆపరేటర్లకు రూ.4 లక్షలు; క్లర్కులు, ఉపాధ్యాయులు (మున్సిపాలిటీ పరిధిలో నడిచే పాఠశాలల్లో), పైప్‌లైన్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ క్యాషియర్‌లకు రూ.5 లక్షలు; సబ్ అసిస్టెంట్ ఇంజనీర్‌కు రూ. 6 లక్షలు - పశ్చిమ బెంగాల్‌లోని మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లలో గ్రూప్ డి, గ్రూప్ సి సర్వీసుల క్రింద ఉన్న స్థానాలకు అధికారులు ఫిక్స్ చేసిన 'రేటు చార్ట్' అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడైంది.

టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఓ నిందితుడి కార్యాలయాలు, ఇతర ప్రాంగణాలపై దాడి తర్వాత, మరో స్కామ్‌ను వెలుగులోకి వచ్చింది. 'క్యాష్ ఫర్ జాబ్స్' రాకెట్‌కు తెరలేపిన ఈ నేరారోపణను అధికారులు తాజాగా కనుగొన్నారు. ED దాఖలు చేసిన దర్యాప్తు నివేదిక ప్రకారం, 2014-15 నుంచి 60 పౌర సంస్థలలో గ్రూప్ D, C సేవల క్రింద 17 స్థానాల్లో 6వేల ఖాళీలు ఉద్యోగాలను అభ్యర్థులతో భర్తీ చేశారు. ఈ మున్సిపాలిటీలలో కంచరపరా, న్యూ బరాక్‌పూర్, కమర్‌హతి, టిటాగర్, బరానగర్, హలిసహర్, సౌత్ డమ్ డమ్, నార్త్ డమ్ డమ్ మొదలైనవి ఉన్నాయి. .

డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లు, లక్షలు చెల్లించిన అభ్యర్థుల జాబితాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ED స్వాధీనం చేసుకున్న ఈ రికార్డుల్లో అభ్యర్థుల వివరాలు, వారి ప్రొఫైల్, నిర్దిష్ట స్థానాల కోసం వారు చెల్లించిన డబ్బు మొత్తానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. “ఈ కిక్‌బ్యాక్‌లను సంబంధిత మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లు, పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు తీసుకున్నారు. నగదు వసూలు చేసిన ఏజెంట్లు, ఉద్యోగాల కోసం చెల్లించిన అభ్యర్థుల వివరాలు మా వద్ద ఉన్నాయి. మా దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. మా వద్ద ఉన్న ఆధారాలతో మున్సిపాలిటీలు లంచాలు తీసుకుని రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌ను తారుమారు చేసి దాదాపు 6వేల ఖాళీలను భర్తీ చేసినట్లు తెలుస్తోంద"ని సీనియర్ ED అధికారి తెలిపారు

తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ దాడులు, కేసులన్నీ బీజేపీ ‘రాజకీయ ప్రతీకారం’లో భాగమేనని వాదిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారులకు వ్యతిరేకంగా ఏజెన్సీల వద్ద ఆధారాలు ఉంటే, వారు వాటిని బహిరంగపరచాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేయాలని కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తమ ప్రభుత్వం దోషులను ఎప్పుడూ రక్షించలేదని, తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవినీతికి పాల్పడినట్లు తేలితే తమ పార్టీ సభ్యులను కూడా అరెస్టు చేయొచ్చని నేతలు అంటున్నారు.