కృష్ణానదిలో మునిగిన సంగమేశ్వరాలయం..దర్శనానికి ఆరు నెలలు ఆగాల్సిందే

కృష్ణానదిలో మునిగిన సంగమేశ్వరాలయం..దర్శనానికి ఆరు నెలలు ఆగాల్సిందే

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వర స్వామి ఆలయం జలాధివాసంలోకి వెళ్లిపోయింది. కృష్ణా జలాలు ఆలయ శిఖర భాగాన్ని తాకాయి. ఎగువనున్న జూరాల ప్రాజెక్టు నుంచి 76,422 క్యూసెక్కుల వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయ నీటిమట్టం 863 అడుగులకు చేరింది. దీంతో సంగమేశ్వరస్వామి శిఖర భాగం కూడా పూర్తిగా మునిగిపోయింది. దీంతో సంగమేశ్వర దర్శనానికి భక్తులు మరో ఆరు నెలల పాటు వేచిఉండాలి.

కృష్ణా వరద నీటిలో మునిగిన సంగమ తీరం సంద్రాన్ని తలపిస్తోంది, సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకున్న అపురూప దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచంలో ఏడు నదులు  (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి)  ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి.