జైలు నుంచి శశికళ మేనల్లుడు విడుదల

జైలు నుంచి శశికళ మేనల్లుడు విడుదల

బెంగళూరు: చిన్నమ్మ అలియాస్ శశికళ మేనల్లుడు వీఎన్ సుధాకరన్ ఇవాళ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతోపాటు జైలు శిక్ష అనుభవించిన సుధాకరన్.. తన జైలు శిక్ష పూర్తి కావడంతో శనివారం పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు జయలలిత పెంపుడు కుమారుడిగా పేరుపడ్డ శశికళ మేనల్లుడు సుధాకరన్, ఇళవరసిలకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది జనవరిలోనే శశికళ జైలు నుంచి విడుదలైనా.. సుధాకరన్ మాత్రం ఇవాళ ఉదయం 11 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చి చెన్నై బయలుదేరారు.
ఒకవైపు సుధాకరన్ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలోనే శశికళ చెన్నైలోని దివంగత జయలలిత స్మారకం వద్ద నివాళులర్పించేందుకు భారీ ర్యాలీగా  వెళ్లారు. చాలా కాలంగా రాజకీయాలకు, గత అసెంబ్లీ ఎన్నికలకు కూడా దూరంగా ఉన్న శశికళ ఇవాళ జయలలిత సమాధి దగ్గర నివాళులు అర్పించడం చర్చనీయాంశం అయింది. సాదాసీదాగా కాకుండా.. భారీ అనుచరగణంతో ర్యాలీగా వెళ్లి నివాళులర్పించడం త్వరలో పొలిటికల్‎గా రీఎంట్రీకి సంకేతమని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే శశికళ జైలు నుంచి విడుదలైనా.. అన్నాడీఎంకే నేతలు వ్యతిరేకించడంతో ఆమె మరో మేనల్లుడు దినకరణ్ పార్టీ తరపున పోటీ చేయాలని భావించినా అనూహ్యంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలెంట్ అయ్యారు.

అన్నాడీఎంకే.. మిత్రపక్షం బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో బీజేపీ పెద్దల సూచన మేరకే పోటీ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం జరిగింది. తనతోపాటు జైలు శిక్ష అనుభవించిన వీఎన్ సుధాకరన్ విడుదలవుతున్న రోజే శశికళ తాజా యాక్టివిటీతో.. ఆమె వర్గం నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపింది. అన్నాడీఎంకేలోని అసంతృప్త నేతలను కూడా చిన్నమ్మ పొలిటికల్ రీ ఎంట్రీకి పావులు కదుపుతున్నారనే  ప్రచారం జరుగుతోంది.