ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకొస్తాయా..డీకే అరుణ

ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకొస్తాయా..డీకే అరుణ

గద్వాల, వెలుగు: ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు స్కీములు తీసుకొచ్చి సీఎం కేసీఆర్​ మోసం చేస్తాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. శుక్రవారం ధరూర్ మండలంలోని ర్యాలంపాడు, మార్లబీడు, చెన్నారెడ్డి పల్లె, బురెడ్డిపల్లె, ధరూరు గ్రామాల్లో పర్యటించి బీజేపీ జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు. అమరవీరుల త్యాగాల పునాదులపై తెలంగాణ నిర్మించుకుంటే కేసీఆర్  ఫ్యామిలీ బంగారు తెలంగాణ అంటూ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుందని విమర్శించారు. 

ఎన్నికలప్పుడే గొర్రెలు, బర్రెల స్కీమ్ లంటూ మాయ చేస్తున్నాడని, ప్రజలు మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఏపీలో జరిగిన అభివృద్ధి తప్ప, తెలంగాణ వచ్చాక నడిగడ్డలో, పాలమూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 9 ఏళ్ల పాలనలో ఎన్ని డబుల్  బెడ్రూమ్ ఇండ్లు కట్టారో లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. స్థలం సేకరించకుండా, ఉన్న జాగలను గుంజుకున్న దద్దమ్మలకు ఓటు అడిగి నైతిక హక్కు లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్  ప్రభుత్వం మెడలు వంచి జోగులాంబ గద్వాల జిల్లాను సాధించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని చెప్పారు. 

నెట్టెంపాడు ప్రాజెక్టుతోనే నడిగడ్డ పచ్చబడిందని, నెట్టెంపాడులో మిగిలిన 10 శాతం పనులు కూడా చేయకపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్అండ్ఆర్  కాలనీల్లో సౌలతులు కల్పించకుండా దౌర్జన్యానికి దిగడం దుర్మార్గం అని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, లీడర్లు రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సంజీవ భరద్వాజ్, రాజేశ్, నరేందర్ రెడ్డి, ప్రతాప్, పెద్ద కిష్టన్న, రాంరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.