
తిరుపతి దర్శనార్థం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరత రాకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సేవలు అందించి వారి మన్ననలు సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కొనియాడారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మంగళవారం సమావేశమైనారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, గత 18 నెలలుగా టీటీడీ మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తూ, 96% మంది భక్తుల సంతృప్తిని టీటీడీ పొందగలిగిందని చెప్పారు. ఇటీవల అన్నప్రసాద వితరణ విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింతగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు.
ALSO READ : శ్రీశైలంలో డ్రోన్ కలకలం..
అన్నప్రసాదం విభాగం అధికారులు డైనమిక్ మ్యాపింగ్ ద్వారా వివిధ రకాల కూరగాయలను దాతల నుండి సేకరించాలని ఆయన ఆదేశించారు. “మైక్రో లెవెల్ ప్లానింగ్ అవసరమని, ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా దాతలు కూరగాయలు అందించేందుకు ప్రోత్సహించాలన్నారు. అలాగే దాతలతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని ” అన్నారు.
అంతకు ముందు అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జి ఎల్ ఎన్ శాస్త్రిలు మాట్లాడుతూ, గత నాలుగేళ్లలో కూరగాయల విరాళాలు 2022లో 5.79% నుండి 2025లో దాదాపు 7% వరకు పెరిగాయని వివరించారు. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు, 6-7 టన్నులు విరాళంగా ఇస్తున్నారని, రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరం ఉంటుందని తెలిపారు. అందుకు దాతలు సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
తరువాత అదనపు ఈవో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూరగాయల దాతలను శ్రీవారి ప్రసాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం ఏఈఓ శివశంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు.