సౌతాఫ్రికాతో కీలకమైన రెండో టెస్టుకు ముందు అభిమానులకు టీమిండియా చేదు వార్త చెప్పింది. తొలి టెస్టులో మెడ కండరాల నొప్పితో బాధపడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, డాక్టర్ల సూచన మేరకు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ సమయంలో మళ్లీ నొప్పి తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున అతడిని ఆడించి రిస్క్ చేయకూడదని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. స్వ్కాడ్ నుంచి తప్పించింది. సెకండ్ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలను రిషబ్ పంత్కు అప్పగించింది. సౌతాఫ్రికాతో సెకండ్ టెస్ట్ శనివారం నుంచి మొదలు కానుంది. గిల్ ఆడే అవకాశం లేదని బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ టీమ్ శుక్రవారం ప్రకటించింది.
రిషబ్ పంత్ ఇండియా 38వ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ కీలక మార్పుతో పాటు తుది జట్టులో రెండు ముఖ్యమైన స్థానాలపై టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా కసరత్తు మొదలుపెట్టింది. గిల్ స్థానంలో రిజర్వ్ బెంచ్‌లోని లెఫ్టాండ్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ వైపు మొగ్గు చూపుతుండటం గమనార్హం. తొలి టెస్ట్‌లో మూడో నంబర్‌లో మెరుగ్గా ఆడిన వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగించి, సుదర్శన్‌ను ఆరో నంబర్‌లో బ్యాటింగ్కు పంపే అవకాశం ఉంది.
మరొక కీలక స్థానం స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, సీమ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య పోటీగా మారింది. అక్షర్ పటేల్ మెరుగైన బ్యాటింగ్ చేయగలడు. కానీ పిచ్‌పై పచ్చిక ఉండి బౌన్స్‌కు అనుకూలిస్తే రైట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రెడ్డికి సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్గా అవకాశం దక్కే చాన్స్ ఉంది. ఐదో బౌలర్‌గా నితీష్ రెడ్డి వస్తే పేస్ బౌలింగ్‌కు సపోర్ట్ లభించడంతో పాటు రైట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య కూడా పెరుగుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ లెక్కలు వేస్తోంది. ఏదేమైనా తొలి టెస్ట్ ఓటమి తర్వాత సరైన కాంబినేషన్‌ను ఎంచుకుని సిరీస్ సమం చేయడానికి ఇండియా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.
