
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి ఉన్న వారికోసం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్జీబీ) 2021–-22 తదుపరి విడత ఇష్యూ సోమవారం నుంచి మొదలవుతోంది. ఇది ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. గ్రాము బంగారం ధరను రూ.5,197గా నిర్ణయించామని ఆర్బీఐ తెలిపింది. కేంద్రం తరపున ఆర్‌బిఐ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుక్కోవచ్చు. కనీసం పెట్టుబడి ఒక గ్రాము. బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు. కావాలనుకుంటే ఐదో సంవత్సరం తరువాత అమ్మేయవచ్చు. ఒక్కో వ్యక్తి 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు. ట్రస్టుల వంటి సంస్థలు ఆర్థిక సంవత్సరానికి 20 కేజీల వరకు కొనొచ్చు. కేవైసీ రూల్స్సాధారణ బంగారం కొనుగోలుకు సంబంధించినట్లే ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది. సాధారణ బంగారానికి డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోలు కోసం ఉపయోగించే డబ్బులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చాలనే టార్గెట్‌తో ఈ పథకాన్ని 2015 నవంబర్ లో మొదలుపెట్టారు. సబ్‌స్క్రిప్షన్‌కు ముందు వారంలోని చివరి 3 పనిదినాల్లో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ పేర్కొన్న 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధరను నిర్ణయిస్తారు.