ఎస్సారెస్పీకి భూములిచ్చిన రైతులు ఇబ్బంది పడుతుండ్రు

ఎస్సారెస్పీకి భూములిచ్చిన రైతులు ఇబ్బంది పడుతుండ్రు
  • భూములు కబ్జా అవుతున్నయ్
  • ఎస్సారెస్పీకి భూములిచ్చిన రైతులు ఇబ్బంది పడుతుండ్రు
  • జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీసిన సభ్యులు
  • సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని 
  • మంత్రి గంగుల ఆదేశం

కరీంనగర్/ కరీంనగర్ టౌన్,  వెలుగు:  జిల్లాలోని కొత్తపల్లి నుంచి వెలిచాల వరకు కాలువకు ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ భూములను ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు చేసి అమ్ముతున్నారని, రూ.కోట్లు చేతులు మారుతున్నాయని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షుక్రోద్దిన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ భూములను కాపాడాలని కోరగా స్పందించిన కలెక్టర్ కర్ణన్​ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. గురువారం కరీంనగర్​జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జడ్పీ పరిషత్​మీటింగ్​హాల్లో​నిర్వహించిన సర్వసభ్య సమావేశం హాట్ హాట్ గా జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అధికారులను పలు అంశాలపై నిలదీశారు. 

కరెంట్ ​కట్​చేస్తున్నరు..

శంకరపట్నం మండలం ఎడవెల్లి గ్రామంలోని దళిత కాలనీలో కరెంటు కట్ చేస్తున్నారని, దీనివల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అధికారులకు ఫోన్​ చేస్తే పట్టించుకోవడం లేదని, కాలనీ సమీపంలో కాలువ ఉండటంతో పాములు, తేళ్లు కరిస్తే  పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డీఈని ట్రాన్స్ ఫర్ చేయాలని మంత్రి గంగులను కోరారు. అలాగే గ్రామాల్లో ముస్లిం గ్రేవ్ యార్డులను బాగు చేయాలని చెప్పినా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో స్పందించిన మంత్రి కమలాకర్, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

ప్రజారోగ్యానికి పెద్దపీట..

ప్రజల ఆరోగ్యంతో పాటు సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అన్నారు. కరీంనగర్ సిటీలో ఆరు అర్బన్ పీహెచ్​సీలు, రెండు బస్తీ దవాఖానాలతోపాటు అదనంగా రాంనగర్, మారుతీనగర్ లో మరో రెండు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో కరీంనగర్ లోనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో కొత్తపల్లి శివారులో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆవరణలో రూ.12.75కోట్లతో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి (అమృత వర్శిని ఆడిటోరియం)తో పాటు ఐబీ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణితో కలిసి మంత్రి  పరిశీలించారు. సమావేశంలో కలెక్టర్ కర్ణన్, సీఈఒ ప్రియాంక, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి.. మంత్రి

రైతులు పండించిన పంటల్ని కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొంటోందని, అయితే ఆ విధానాన్ని రద్దు చేసి ప్రైవేట్ వారికి అప్పగించేలా కుట్రలు జరగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్​ఆరోపించారు. ఇందుకు ధాన్యం కొనుగోలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు.