రాజన్నసిరిసిల్లలో చీరల తయారీకి కూలీ రేటు ఖరారు

రాజన్నసిరిసిల్లలో చీరల తయారీకి కూలీ రేటు ఖరారు
  •  ప్రభుత్వానికి నేతన్నలకు కుదిరిన ఒప్పందం 
  •  బట్ట ఉత్పత్తికి ఆసామికి మీటరు రూ.34, కార్మికుడికి కూలీ రూ.5
  •  మహిళా సంఘాలకు చీరలు అందించేందుకు సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  ఒప్పందం ఖరారుతో స్పీడందుకోనున్న ఉత్పత్తి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఇందిరా మహిళా శక్తి స్కీం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చీరలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నేతన్నలకు కూలీ ఒప్పందం ఇటీవల ఖరారైంది. వస్త్ర ఉత్పత్తికి మీటరుకు ఆసామికి రూ.34, కార్మికునికి రూ.5 ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.. గత ఫిబ్రవరిలో 4.24 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు టెస్కో అధికారులు సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. కాగా కూలీ ఖరారు కాకపోవడంతో ఉత్పత్తి స్లోగా సాగింది. 

మీటరుకు రూ. 34

మహిళా సంఘాల సభ్యులకు అందించే చీరల ఉత్పత్తులకు సంబంధించి మూడు రోజుల అధికారులు కార్మికులతో చర్చలు జరిపి కూలీ ఖరారు చేశారు. ఆసాములు నేరుగా  డిపో  నుంచి యారన్ తెచ్చుకుంటే మీటరు వస్త్రం ఉత్పత్తికి రూ.34 కూలీ నిర్ణయించారు. ఇందులోంచి కార్మికునికి మీటరుకు రూ. 5. కూలీ రాగా, ఆసామికి రూ. 6 , యారన్ కొనుగోలుకు రూ. 19, జీఎస్టీతో కలుపుకొని వార్పిన్, ఇతర ఖర్చులు కలిపి రూ. 4 మొత్తం కలిపి మీటరు వస్త్రం ఉత్పత్తికి రూ. 34 ఖర్చవుతోంది. 

కార్మికులతో ఆఫీసర్ల చర్చలు 

చీరల ఉత్పత్తికి కూలీ రేటు ఖరారు కాకపోవడంతో కార్మికులు ఉత్పత్తిని ఆపేశారు. సాంచాలు బంద్ పెట్టి గత నెలంతా సమ్మెలోనే ఉన్నారు. మూడు రోజుల కింద చేనేత ఆఫీసర్లు కార్మికులతో చర్చలు జరిపి కూలీ ఖరారు చేయడంతో ఉత్పత్తి ఊపందుకోనుంది. ఈ చీరల అందజేతకు ఆగస్టు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కాగా.. కూలీ రేటు ఖరారు కావడంతో ఉత్పత్తి స్పీడందుకోనుంది. 

కూలీ ఖరారైంది 

మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందించే చీరలకు సంబంధించి కూలీ ఖరారైంది. మీటరు వస్త్రం ఉత్పత్తికి రూ. 34 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గడువులోగా ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌జీ సభ్యులకు చీరలు అందించేలా చర్యలు తీసుకుంటాం. 

రాఘవరావు, చేనేత జౌళిశాఖ ఏడీ