
- కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
వంగూరు : వెలుగు: అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్లతో 18 రకాల అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు. రూ.6 కోట్లతో జడ్పీహెచ్ఎస్, ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్, రూ.30 లక్షలతో పాలసేకరణ కేంద్రం, రూ.30 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ (మాల), 30 వేల లీటర్ల సామర్థ్యంతో పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు.
రూ.55 కోట్లతో కొండారెడ్డిపల్లి గేట్ నుంచి పోల్కంపల్లి వరకు రోడ్డు విస్తరణతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగించడంలో కొండారెడ్డిపల్లి సౌత్ ఇండియాలో మొదటిదని, దేశంలోనే రెండో గ్రామమని తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామ సౌర విద్యుత్ ప్రాజెక్టును రూ.10.53 కోట్లతో చేపట్టినట్లు పేర్కొన్నారు.
రూ.7.96 కోట్లతో సోలార్ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. మౌలిక వసతుల కోసం రూ.2.59 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఊరిలోని 516 ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి నెలకు 360 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇంటికి వినియోగించుకున్న తర్వాత మిగిలిన విద్యుత్‌ను యూనిట్‌కు రూ.5.25 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు చేస్తాయని తెలిపారు.
సెప్టెంబర్ లో గ్రామం నుంచి సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ గ్రిడ్‌కు అందించి.. రూ.5 లక్షల ఆదాయం పొందారన్నారు. రూ. 2.50 కోట్లతో కొండారెడ్డిపల్లి పాలశీతలీకరణ కేంద్రం కెపాసిటీని రోజుకు 13 వేల లీటర్ల నుంచి 30 వేల లీటర్లకు పెంచినట్లు చెప్పారు. 30 వేల లీటర్ల కెపాజిటీ గల మిల్క్ కూలింగ్ సెంటర్ స్టేట్‌లో ఇదొక్కటేనన్నారు. మరో రూ.1.05 కోట్లతో సెంటర్లో ల్యాబ్, తదితర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచిపుల్ల రాజేశ్ రెడ్డి, కలెక్టర్ సంతోష్, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, అచ్చంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లయ్య, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.