కాలుష్యకారక కంపెనీలపై ఉక్కుపాదం

కాలుష్యకారక కంపెనీలపై ఉక్కుపాదం
  • మూసేయాలంటూ 305 కంపెనీలకు పీసీబీ ఆదేశాలు
  • నిబంధనలను పాటించని మరో 1,234 సంస్థలకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న  పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతోంది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలను పాటించని సంస్థలను మూసివేస్తున్నది. తాజాగా నిబంధనలను ఉల్లంఘించిన 305 సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. మరో 1,234 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో పీసీబీ వెల్లడించింది. కాలుష్య తీవ్రత ఆధారంగా రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్​ జోన్లలో 12,264 కంపెనీలు ఉన్నాయని తెలిపింది. ‘‘2024 జనవరి నుంచి 2025 అక్టోబర్​ వరకు 2,620 కొత్త కంపెనీలకు అనుమతులిచ్చాం.

 మరో 3,521 సంస్థలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించాం. కాలుష్య నియంత్రణకు సంబంధించి వివిధ పరిశ్రమల నుంచి 7,966 వేస్ట్​ వాటర్​ శాంపిళ్లు, 3807 ఎయిర్​ పొల్యూటెంట్​ శాంపిళ్లను సేకరించాం. వాటిని ల్యాబుల్లో టెస్ట్​ చేశాం. టెస్టుల్లో ఫెయిలైన శాంపిళ్లకు సంబంధించిన కంపెనీలకు నోటీసులిచ్చాం” అని పీసీబీ వివరించింది. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్నాక 697 సంస్థలకు ఇచ్చిన క్లోజర్​ ఆర్డర్​ను ఉపసంహరించుకున్నామని తెలిపింది. అత్యధికంగా కాలుష్యానికి కారణమవుతున్న 501 కంపెనీలపై 24 గంటల పాటు ఆన్​లైన్​ మానిటరింగ్​ సెల్​ను ఏర్పాటు చేశామని వెల్లడించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన 108 కంపెనీలపై టాస్క్​ ఫోర్స్​ కమిటీ రివ్యూ చేసిందని, వెంటనే వాటిని సరిచేసుకోవాలని లేదంటే లీగల్​ యాక్షన్​ తీసుకుంటామని కమిటీ హెచ్చరించిందని వెల్లడించింది. 

వేస్ట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ విస్తరణ

కాలుష్య నియంత్రణకు సంబంధించి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు 10741 టోల్​ ఫ్రీ హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేశామని పీసీబీ తెలిపింది. అంతేకాకుండా జనవాణి కాలుష్య నివారిణి అనే మొబైల్​ యాప్​ కూడా అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఇండస్ట్రియల్​ జోన్లలో నైట్​ పెట్రోలింగ్​ చేస్తున్నామని తెలిపింది. బల్క్​ డ్రగ్, కెమికల్​ పరిశ్రమల్లో జీరో లిక్విడ్​ డిశ్చార్జ్​ సిస్టమ్స్​ను కచ్చితంగా ఏర్పాటు చేసేలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పొల్యూషన్​ను తగ్గించేలా శుద్ధిచేసిన వేస్ట్​ వాటర్​ను కంపెనీలు తిరిగి వాడుకునేలా చర్యలు చేపట్టామంది.