సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్

సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్
  • త్వరలో ప్రారంభం.. ఏర్పాట్లు పూర్తి
  • రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మందమర్రిలో ఏర్పాటు
  • ట్రయల్ రన్  విజయవంతం
  • ఏడాదికి 90 లక్షల యూనిట్ల సోలార్  పవర్  సద్వినియోగం 

హైదరాబాద్, వెలుగు: వినియోగించని సోలార్  విద్యుత్తును బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలు కల్పించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్  సిస్టమ్ (బీఈఎస్ఎస్) ను రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు. సింగరేణి కాలరీస్  కంపెనీ.. మందమర్రి ఏరియాలో 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు అనుబంధంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్  సిస్టంను ఇటీవల ఏర్పాటు చేసింది. 

ఇది ఒక మెగావాట్  సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్. దీనిని రెండు మూడు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.  రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో పాటు పలు రాష్ట్ర సంస్థలు సోలార్  విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్  ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తున్నాయి. 

ఈవిధంగా ఉత్పత్తి చేసే విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్ కో గ్రిడ్  ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్  పవర్ ను గ్రిడ్ కు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మిగిలిపోయిన సోలార్  విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బీఈఎస్ఎస్ లో నిల్వ చేసి గరిష్ట విద్యుత్  వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు వినియోగిస్తారు. 

సింగరేణివ్యాప్తంగా  ఏర్పాటు చేస్తం: సీఎండీ 

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున సుమారు 250 మెగావాట్ల బీఈఎస్ఎస్ లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో మందమర్రిలో ఏర్పాటు చేసిన బీఈఎస్ఎస్  తొలి అడుగుగా భావించవచ్చు. సుమారు రూ.2.73 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో ఏడాదికి 90 లక్షల యూనిట్ల సోలార్  విద్యుత్తును సద్వినియోగం చేయవచ్చు. 

అలాగే సంస్థకు ఏడాదికి రూ.70 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది.  కాగా.. తొలిసారిగా బీఈఎస్ఎస్ ను ఏర్పాటు చేసే అవకాశం తమకు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం కృతజ్ఞతలు తెలిపాశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సింగరేణివ్యాప్తంగా బీఈఎస్ఎస్ లను ఏర్పాటు చేస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.