న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్రాన్ని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎంఓపీఎస్) ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు ఆందోళన చేపట్టారు.
ఎన్ఎంఓపీఎస్ జాతీయ అధ్యక్షుడు వీకే.బంధు, సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... కేంద్రం తెచ్చిన నూతన పిన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండుతో ఎన్ఎంఓపీఎస్ ఏండ్లుగా పోరాడుతున్నదన్నారు.
ఈ పోరాటం ఫలితంగానే రాజస్తాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో పాత పెన్షన్ పథకం(ఓపీఎస్) అమలవుతోందని చెప్పారు. తాజాగా పంజాబ్‌లోనూ ఓపీఎస్ ను పునరుద్ధరించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్ పాల్గొన్నారు.
