
- ఎంఎస్ఎంఈ –2024 పాలసీలో ప్రభుత్వం వెల్లడి
- ఇండస్ట్రియల్ పార్కుల్లో మహిళలకు 5 శాతం..ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం ల్యాండ్ రిజర్వేషన్
- ఎస్సీ, ఎస్టీలకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రూ.75 లక్షల నుంచి రూ.కోటికి పెంపు
- మహిళలకు రూ.10 లక్షల నుంచి 20 లక్షలు పెంపు
హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కోసం ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఐదేండ్లలో విడతల వారీగా వాటిని ఏర్పాటు చేయనుంది. అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లోనూ దళితులు, గిరిజనులు, మహిళలకు పెద్ద పీట వేయనుంది. ప్రతి ఇండస్ట్రియల్ పార్కులో ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, మహిళలకు 5 శాతం భూములను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించనుంది.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మరో పది ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. వాటిలో ఐదింటిని ఎంఎస్ఎంఈ పార్కులుగా అభివృద్ధి చేయనుంది. ఇందులో ఒక ఇండస్ట్రియల్ పార్కును ప్రత్యేకంగా మహిళల కోసం.. ఇంకొక పార్కును ఇన్నొవేటివ్ స్టార్టప్స్ కోసం కేటాయించనుంది. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విడుదల చేసిన ఎంఎస్ఎంఈ –2024 పాలసీలో ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో పేర్కొన్న అంశాలను ఆమోదిస్తూ జీవోనూ జారీ చేసింది. ప్రతి పార్కులోనూ హాస్టళ్లు, హోటళ్లు, టెస్టింగ్ సెంటర్లు, ఆర్ అండ్ డీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
అంతేగాకుండా దళితులకు ఇప్పటివరకు భూమి కొనుగోలులో ఇస్తున్న 33 శాతం (రూ.30 లక్షలు దాటకుండా) రిబేటును 50 శాతానికి (రూ.50 లక్షల వరకు) పెంచింది. మిగతా పరిశ్రమలకూ ఇప్పుడున్న రిబేటును తగ్గించకుండా అతి తక్కువ ధరకు భూములు అందించేలా త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రతి నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది.
ఎంఎస్ఈలు ఎదుర్కొంటున్న ఆరు సమస్యలపై దృష్టి సారించిన సర్కారు.. ఎంఎస్ఎంఈ పాలసీ డాక్యుమెంట్లో వాటికి పరిష్కార మార్గాలనూ చూపించింది. భూమి లభ్యతను పెంచి తక్కువ ధరకు అందించడం, ఆర్థిక సహకారం అందించడం, ముడి సరుకుల కొరత రాకుండా చూడడం, నైపుణ్యం కలిగిన యువతను అందించడం, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు సహకారం, మార్కెటింగ్ సౌలతులను పెంచడం వంటి వాటిని ఎంఎస్ఎంఈలకు అందించనుంది.
ఆర్థిక చేయూత పెంపు
ఎంఎస్ఎంఈలకు ప్రస్తుతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద రూ.20 లక్షలకు మించకుండా 15% వరకు సబ్సిడీని అందిస్తున్నారు. దానిని రూ.30 లక్షలకు మించకుండా సబ్సిడీని 25 శాతానికి పెంచింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రస్తుతం ఉన్న పది శాతం (రూ.10 లక్షల వరకు) సబ్సిడీని.. 20 శాతానికి (రూ.20 లక్షల వరకు) పెంచింది. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆర్థిక చేయూతను 50 శాతానికి పెంచింది.
ప్రస్తుతం రూ.75 లక్షలకు మించకుండా 33% వరకు సబ్సిడీని ఇస్తుండగా.. దానిని 50 శాతానికి పెంచి రూ.కోటి వరకు సబ్సిడీని అందించనుంది. రా మెటీరియల్స్‌ను సేకరించుకునేందుకు పది జిల్లాల్లో పది కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. తక్కువ ధరకు రా మెటీరియల్స్‌ను అందించనుంది. ప్రతి ఇండస్ట్రియల్ పార్కులోనూ ఒక వేర్హౌస్ను నెలకొల్పనున్నారు.
స్కిల్ వర్సిటీ ద్వారా ఉద్యోగుల భర్తీ.. ప్రత్యేకంగా ‘యంత్రం ఫండ్’
ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు నిపుణుల కొరత ఉండడంతో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు శిక్షణనిచ్చి వారిని ఎంఎస్ఎంఈలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. తద్వారా ఎంఎస్ఎంఈల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత లేకుండా చూడనుంది. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచనుంది. ఎంఎస్ఎంఈల్లో లోపించిన టెక్నాలజీని మూడు నెలల్లో అందించేందుకు స్టడీ చేయించనుంది.
తద్వారా ప్రొడక్షన్‌ను మెరుగుపరచుకునే అవకాశం కల్పించనుంది. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం ‘యంత్రం ఫండ్’ అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. వచ్చే నాలుగేండ్లలో రూ.వంద కోట్లు దాని కోసం కేటాయించనుంది. మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచనుంది. పెద్ద పరిశ్రమలు స్థానికంగా ఉన్న ఎంఎస్ఎంఈల నుంచే సరుకును సేకరించేలా కొత్త విధానం తీసుకురానుంది. విదేశాల నుంచి తెప్పించుకునే శాంపిళ్లపై ఎంఎస్ఎంఈలకు సర్కారు చెల్లించే డ్యూటీని రూ.15 లక్షలకు పెంచింది. ఆన్లైన్లో ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పోర్టల్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లను అభివృద్ధి చేయనుంది.
ర్యాంప్ స్కీమ్
కరోనా టైమ్‌లో మూతపడిన పరిశ్రమలను తెరిపించడం, నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను పైకి తేవడం కోసం ర్యాంప్ (RAMP: రైజింగ్, యాక్సిలరేటింగ్, ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్) అనే కొత్త స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా టెక్నాలజీ ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సంస్థల మధ్య కో ఆర్డినేషన్‌ను పెంచనుంది. మహిళలకూ సమాన అవకాశాలు కల్పించేలా విధివిధానాలను రూపొందించనుంది.
దీని కోసం రూ.117.35 కోట్లను ఇప్పటికే సెంట్రల్ స్కీమ్ కింద ఆమోదించినట్టు ర్యాంప్‌లో పేర్కొంది. ఎంఎస్ఎంఈల కోసం యునిఫైడ్ డేటాబేస్‌ను ఏర్పాటు చేయనుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం ఆరు ఫిజికల్, ఒక వర్చువల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. నష్టపోయిన, మూతపడిన సంస్థలపై త్వరలోనే సర్వే నిర్వహించనుంది.