ఆగని నకిలీ దందా

ఆగని నకిలీ దందా

మహబూబాబాద్​, వెలుగు: జిల్లాలో వానాకాలం సీజన్​లో పంటల సాగు చేసేందుకు రైతులు సమాయాత్తం అవుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు.ఇదే అదునుగా నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు ఏజెంట్లు గ్రామాలు, తండాలకు వస్తున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ మిర్చి, పత్తి, ఇతర విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు చాప కింద నీరులాగా కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని బార్డర్​ మండలాలు మరిపెడ, నరసింహులపేట, దంతాలపల్లి, తొర్రూరు మండలాల పరిధిలో ప్రతి సంవత్సరం అక్రమ సీడ్స్​ విక్రయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల9న జిల్లాలోని మరిపెడ మండల పరిధిలో ఆర్లగడ్డ తండా సమీంలో నంబర్​ ప్లేట్​లేని స్విప్ట్​ డిజైర్​ కారులో అనుమతి లేని 225 మిర్చి సీడ్​ ప్యాకెట్లను పోలీసులు సీజ్​ చేయడం కలకలం రేపింది. 

వెంటాడుతున్న నకిలీ విత్తనాల బెడద..

ఏటా గ్రామాల్లో కొందరు ఏజెంట్లు పలు కంపెనీల పేర్లు చెప్పుకొని నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ విత్తనాలు మొలకెత్తవు, ఒకవేళ మొలకెత్తినా కాతపూత ఉండదు. దీంతో రైతులు లబోదిబోమని మొత్తుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పెట్టుబడులు మీదపడి చాలా మంది రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఖమ్మం, ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి పలు రకాల నకిలీ విత్తన ప్యాకెట్లు తెస్తున్నారు. తక్కువ ధరకు విత్తనాలు దొరుకుతాయని పంట దిగుబడులు ఎక్కువగా ఉంటాయంటూ మోసగాళ్లు నకిలీ సీడ్స్​ అంటగడుతున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
 

గత సంవత్సరం ఇదే సీజన్​లో 
జిల్లాలో గత సంత్సరం జూన్​ 7న అనుమతి లేని దీప్తి వెరైటీ మిరప బాక్సులు - 8 (1600 ప్యాకెట్లు), భూమిక మిరప వెరైటీ బాక్సులు -5 (1000 ప్యాకెట్లు), పలనాడు వెరైటి మిరప బాక్సులు-1 (25 ప్యాకెట్లు),.సిరి వెరైటీ మిరప 10 పాకెట్స్, రాజేశ్వరి వెరైటీ మిరప 6-బాక్సులు (300 ప్యాకెట్లు), 6).పద్మావతి వెరైటీ మిరప 5-బాక్సులు (271 ప్యాకెట్లు),అల్ట్రా వెరైటీ 1-బాక్సు (32 ప్యాకెట్లు) లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది పంటల కాలం స్టార్ట్​ అవుతున్న క్రమంలో నకిలీ విత్తనాల దందాను అడ్డుకోవాలని రైతులు
 కోరుతున్నారు. 


 రైతులకు అవగాహన కల్పించాలి
విత్తనాల ఎంపికపై రైతులకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. అధికారులు తనిఖీలను పెంచాలి. నాణ్యమైన విత్తనాలు కొనుగోలుచేసేలా చూడాల్సిన బాధ్యత ఆఫీసర్ల పై ఉంది. విత్తనాలు తీసుకునే ప్రతి రైతువిధిగా బిల్లు తీసుకోవడం ద్వారా నష్ట పోకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలి. 
                                                                                                                                                                                                            - కందాడి అశోక్​ రెడ్డి, కాంగ్రెస్​ కిసాన్​ సెల్​ జిల్లా ఉపాధ్యక్షుడు


దళారులను నమ్మవద్దు
 సీడ్స్​ అమ్మే దళారులను రైతులు నమ్మవద్దు. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన షాపుల్లో మాత్రమే విత్తనాలను కొనాలి. వాటిని కొన్న తర్వాత బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రామాల్లో లూజ్​ సీడ్స్ విక్రయించే వారి సమాచారాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందించాలి. రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  - ఛత్రు నాయక్​, జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​, మహబూబాబాద్​