ఖానాపూర్, వెలుగు: ఆధ్యాత్మికతతోనే పరిపూర్ణ జీవితం సాధ్యమవుతుందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. ఆదివారం ఖానాపూర్ లో నిర్వహించిన గోదాశ్రీకృష్ణ మందిర ప్రతిష్ఠ మహా కుంభ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతిరోజు దైవ ప్రార్థన చేస్తే అన్నీ మంచి జరుగుతాయన్నారు.
దేవుడిని పూజించే సందర్భంగా మంత్రోచ్ఛరణ ప్రతి మనిషిలో ఎంతో శక్తిని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పంచరాత్ర ఆగమ పండితులు శ్రీమాన్ అనంత స్వామి, అర్చకులు వెంకటరమణాచార్యులు, కడెం నారాయణరెడ్డి కుటుంబ శిష్యులు రూపా సురేశ్‌రెడ్డి, అనితారెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు పి.రవీందర్ రావ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి జాన్సన్ నాయక్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఎం.సురేష్, నాయకులు తదితరులు ఉన్నారు.
