ఈ పండుగ సీజన్​లో తక్కువకే టీవీలు.... మొబైల్స్​, కంప్యూటర్లు దొరికే చాన్స్​..

ఈ పండుగ సీజన్​లో తక్కువకే టీవీలు.... మొబైల్స్​, కంప్యూటర్లు దొరికే చాన్స్​..

వెలుగు బిజినెస్​ డెస్క్​: చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్​ కాంపోనెంట్స్ రేట్లు,  రవాణా ఖర్చులతోపాటు, సెమికండక్టర్​ చిప్స్​ రేట్లు భారీగా  తగ్గడం వల్ల ఈసారి పండుగ సీజన్​లో టెలివిజన్​లు, మొబైల్​ ఫోన్లు, కంప్యూటర్ల ధరలు తగ్గే ఛాన్స్​ కనబడుతోంది. కొవిడ్​ టైములో ఒక కంటెయినర్ కోసం పెట్టాల్సి వచ్చిన ఖర్చు గరిష్టంగా 8 వేల డాలర్లుండేది. ఇప్పుడది 850–1000 డాలర్లకు పడిపోయింది. అలాగే సెమికండక్టర్ల (చిప్స్​) రేట్లయితే ఆల్​టైమ్​ కనిష్టానికి చేరాయి. మరోవైపు ఎలక్ట్రానిక్​ కాంపోనెంట్ల ధరలూ 60 నుంచి 80 శాతం దాకా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో టీవీలు, మొబైల్స్​, కంప్యూటర్ల తయారీ కంపెనీలు తమకు వచ్చిన బెనిఫిట్లో కొంతయినా కస్టమర్లకు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా టీవీలు, మొబైల్స్​, కంప్యూటర్లకు గిరాకీ పెద్ద ఎక్కువగా లేదు. రాబోయే దీపావళి సహా ఇతర పండుగల టైములో రేట్లు తగ్గించడం ద్వారా డిమాండ్​కు బూస్ట్​ తేవడానికి తయారీ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్టులు పేర్కొంటున్నారు. ఇన్​పుట్స్​​ ఖర్చు  తగ్గడం వల్ల కన్జూమర్​ ఎలక్ట్రానిక్స్​ కంపెనీల ఆపరేటింగ్​ ప్రాఫిట్​ మార్జిన్లు భారీగానే పెరిగే ఛాన్సు కూడా ఉందని వెల్లడిస్తున్నారు. 

తగ్గుతున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల ధరలు

చాలా ఎలక్ట్రానిక్​ కాంపోనెంట్ల ధరలు కొవిడ్​ ముందు లెవెల్​కు చేరాయని, కొన్ని కాంపోనెంట్ల రేట్లయితే అంతకంటే తక్కువకు కూడా పడిపోయాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్​గా డిమాండ్​ తగ్గిపోవడంతోపాటు, కొన్ని దేశాలలో రెసిషన్​ కూడా ఇందుకు కారణాలని డిక్సన్​ టెక్నాలజీస్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ అతుల్​ లాల్​ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్​ కాంట్రాక్టు మాన్యుఫాక్చరింగ్​ రంగంలో మన దేశంలో డిక్సన్​ టెక్నాలజీస్​ అతి పెద్ద కంపెనీ. రాబోయే కొన్ని నెలలపాటు ఇన్​పుట్స్​ రేట్లు ఇదే లెవెల్​లో కొనసాగే అవకాశాలే కనపడుతున్నాయని పేర్కొన్నారు. ఏవో కొన్ని మార్పులు ఉండొచ్చని అన్నారు.  సొంత ఎలక్ట్రానిక్​ ప్రొడక్టులతోపాటు, చాలా కంపెనీలకు స్మార్ట్​ఫోన్లు తయారు చేసే జైనా గ్రూప్​ ఎండీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిప్స్​, కెమెరా మాడ్యూల్స్​ సహా  స్మార్ట్​ఫోన్​ కాంపోనెంట్ల రేట్లన్నీ దిగిపోయాయని పేర్కొన్నారు. ఫలితంగా  అన్ని బ్రాండ్స్​ ఇందులో కొంత బెనిఫిట్​అయినా కన్జూమర్లకు ఇచ్చి, పండుగ సీజన్​లో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తాయని అన్నారు. మరోవైపు డిక్సన్​ టెక్నాలజీస్, హావెల్స్​, బ్లూ స్టార్​ వంటి లిస్టెడ్​ కంపెనీలు తమ క్వార్టర్లీ ఎర్నింగ్స్​ కాల్స్​లో ఈ ఏడాది మార్జిన్లు పెరిగే ఛాన్స్​లున్నాయని తెలిపాయి. 

ఓపెన్​  సెల్​ రేట్ల పతనం...

గ్లోబల్​గా ఓపెన్​ సెల్​ రేట్లు తగ్గడంతో తమ కన్జూమర్​ ఎలక్ట్రానిక్స్​ పోర్ట్​ఫోలియో సగటు అమ్మకం రేటు 2022–23 లో  రూ. 11,500 కి దిగిపోయిందని, అంతకు ముందు ఏడాది అంటే 2021–22 లో ఈ సగటు అమ్మకం రేటు రూ. 16,400 గా ఉండేదని డిక్సన్​ టెక్నాలజీస్​ మేనేజ్​మెంట్​ వెల్లడించింది. టెలివిజన్ల తయారీలో ఓపెన్​సెల్​ చాలా ముఖ్యమైన కాంపోనెంట్​. అంతేకాదు, ఇదే అత్యంత ఖరీదైన కాంపోనెంట్​ కూడా. ముడి సరుకుల రేట్లు దిగొస్తుండడంతో తమ మార్జిన్లు అంతకు ముందు లెవెల్​కు పెరుగుతాయనే ఆశాభావాన్ని హావెల్స్​ ఇండియా చైర్మన్​ అనిల్​ రాయ్​గుప్తా ఎనలిస్టులకు వెల్లడించారు.

చిప్​ కంపెనీలకు భారీ నష్టాలు...

గ్లోబల్​గా చిప్​ కంపెనీలు గడచిన క్వార్టర్లో రికార్డు నష్టాలను ప్రకటించాయి. ఓవైపు డిమాండ్​, మరోవైపు రేట్లూ తగ్గడం వల్లే వాటికి ఈ పరిస్థితి దాపురించింది. జనవరి–మార్చి క్వార్టర్లో ఇంటెల్​ మునుపెన్నడూ లేనంత నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ సెమికండక్టర్​ కంపెనీ అమ్మకాలు తగ్గడం వరసగా ఇది అయిదో క్వార్టర్​. ప్రపంచంలోనే అతి పెద్ద మెమొరీ చిప్ ​మేకర్​గా పేరొందిన శాంసంగ్ ​ఆపరేటింగ్ ప్రాఫిట్​ ఏకంగా 95 శాతం తగ్గిపోయింది. గత 14 ఏళ్లలో ఈ కంపెనీ ఏ క్వార్టర్లోనూ ఇంత తక్కువ ఆపరేటింగ్ ప్రాఫిట్​ ప్రకటించలేదు.

మన దేశంలోని మార్కెట్​ పరిస్థితి....

కిందటేడాది పండుగ సీజన్​ తర్వాత దేశంలో టీవీలు, మొబైల్స్​, ఇతర అప్లయెన్సెస్​ డిమాండ్​ తగ్గిపోయింది. ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగా ఉండటంతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, టెక్​ సెక్టార్లో ఉద్యోగాలు పోయిన నేపథ్యంలో అలాంటి ప్రొడక్టులను కొనడాన్ని కన్జూమర్లు వాయిదా వేసుకున్నారు. జనవరి–మార్చి 2023 క్వార్టర్లో ఇండియాలో స్మార్ట్​ఫోన్ల సేల్స్​ 16 శాతం, కంప్యూటర్ల అమ్మకాలు 30 శాతం పడిపోయినట్లు మార్కెట్​ రీసెర్చ్​ కంపెనీ ఐడీసీ ఇండియా తన రిపోర్టులో ఇటీవలే వెల్లడించింది. తాజాగా ఇన్​ఫ్లేషన్​ తగ్గుముఖం పట్టడంతో, రేట్లు కూడా కొంత తగ్గితే మళ్లీ డిమాండ్​ పుంజుకుంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.