
- మళ్లీ స్కూల్లో చేరిన బాలిక
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర దుమారానికి కారణమైన ఏడో తరగతి బాలిక పంఖూరి త్రిపాఠి ఫీజు కథ సుఖాంతమైంది. ఫీజు కట్టలేక 4 నెలలుగా చదువుకు దూరమైన బాలిక.. ఎట్టకేలకు ప్రభుత్వ జోక్యంతో సోమవారం మళ్లీ గోరఖ్‌పూర్‌లోని తన స్కూల్ కు వెళ్లింది. ఈ సందర్భంగా బాలిక తండ్రి రాజీవ్ త్రిపాఠి మాట్లాడుతూ.."మా కూతురు ఎలాంటి ఫీజు చెల్లించకుండా సరస్వతి శిశు మందిర్‌లోనే చదివేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక లెటర్ వచ్చింది. కాస్త ఆలస్యమైనప్పటికీ.. సీఎం ఆదిత్యనాథ్ హామీని నెరవేర్చారు.
అందుకు ఆయనకు థ్యాంక్స్" అని పేర్కొన్నారు. స్కూల్ కు వెళ్లే ముందు బాలిక మాట్లాడుతూ.."నేను మళ్లీ నా స్కూల్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైన సీఎం యోగి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు థ్యాంక్స్. నా చదువు కొనసాగుతుందని, స్కూల్ ఫీజు మాఫీ అవుతుందని సీఎం హామీ ఇచ్చారు. చెప్పినట్టే చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌కు సంబంధించిన వ్యక్తులు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకువచ్చారు. కానీ, సీఎంపై నమ్మకంతో నేనే వారి సాయాన్ని వద్దన్నాను" అని పంఖూరి త్రిపాఠి పేర్కొంది.