రాగిపై 50 శాతం టారిఫ్‌‌ .. ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం

రాగిపై 50 శాతం టారిఫ్‌‌ .. ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం
  • ఇండియాపై  ప్రభావం తక్కువే
  • అమెరికాకు మన కాపర్ ఎగుమతులు సుమారు రూ.3,100 కోట్లు

న్యూఢిల్లీ: అమెరికా  శుక్రవారం (ఆగస్టు 1)  నుంచి సెమీ- ఫినిష్డ్ రాగి, రాగి ఆధారిత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధిస్తామని  ప్రకటించింది.  ఇండియా నుంచి యూఎస్‌‌కి జరిగే  రాగి ఎగుమతులపై దీని ప్రభావం ఉంటుంది. ‘‘రాగి దిగుమతులు యూఎస్‌‌ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయి. ఈ టారిఫ్ ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది.  రద్దు లేదా సవరణ లేనట్లయితే కొనసాగుతుంది” అని వైట్ హౌస్  ప్రకటించింది . భారత్  2‌‌‌‌024–25 లో   అమెరికాకు 360 మిలియన్ డాలర్ల (రూ.3,100 కోట్ల)  విలువైన రాగి ఉత్పత్తులు (ప్లేట్స్, ట్యూబ్స్, సెమీ-ఫినిష్డ్ ఫారమ్స్) ఎగుమతి చేసింది.  ఇప్పుడు వీటి ధరలు పెరుగుతాయి.   

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్  ఇనీషియేటివ్ (జీటీఆర్‌‌‌‌ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ ప్రకారం, ఈ టారిఫ్ జపాన్, ఈయూ వంటి మిత్ర దేశాలతో సహా అన్ని దేశాలకు ఒకేరీతిగా వర్తిస్తుంది. కాబట్టి భారత్‌‌ ఎక్కువగా నష్టపోదు.  ఇండియా రాగి కోసం దిగుమతులపై ఆధారపడుతోంది.  2024–-25లో 14.45 బిలియన్ డాలర్ల విలువైన రాగిని  ప్రధానంగా చిలీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంది. యూఎస్ నుంచి కూడా 288 మిలియన్ డాలర్ల విలువైన కాపర్ స్క్రాప్​ను  దిగుమతి చేసుకుంది. 

 యూఎస్ విధించే  50శాతం టారిఫ్‌‌తో పోలిస్తే  కాపర్ ఓర్‌‌‌‌, కాన్సెంట్రేట్స్‌‌పై ఇండియా 2.5శాతం, రిఫైన్డ్ కాపర్, అలాయ్‌‌లపై 5శాతం, కొన్ని రాగి వస్తువులపై 10శాతం టారిఫ్ విధిస్తోంది.  రక్షణ, క్లీన్ ఎనర్జీ, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో విదేశీ రాగి వాడకాన్ని తగ్గించాలని అమెరికా తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌, పవర్ గ్రిడ్‌‌లు, సెమీకండక్టర్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్‌‌లో రాగి కీలకం.  ఈ 50శాతం టారిఫ్ ఉత్పత్తి ఖర్చులను పెంచి, యూఎస్‌‌ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను ప్రభావితం చేయొచ్చని శ్రీవాస్తవ హెచ్చరించారు.