ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం శుభ ముహూర్తం ఎప్పుడంటే....

ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం శుభ ముహూర్తం ఎప్పుడంటే....

హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరాలిచ్చే తల్లి వర మహాలక్ష్మీని ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను కొలుస్తారో.. వారందరి కోరికలను తీర్చే కల్పవల్లి. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. ఇదిలా ఉండగా.. వర మహాలక్ష్మీ వ్రతాన్ని ఏ సమయంలో ప్రారంభించాలి? ఏ లగ్నంలో పూజలు చేయాలనే వివరాలనుతెలుసుకుందాం...

శుభ ముహుర్తం..

  • వర మహాలక్ష్మీ 2023 తేదీ శుక్రవారం 25 ఆగస్టు 2023
  • నక్షత్రం : అనురాధ
  • అనురాధ నక్షత్ర సమయం : 25 ఆగస్టు 2023 శుక్రవారం ఉదయం 9:15 గంటల వరకు
  • వృషభ లగ్నం పూజా ముహుర్తం : రాత్రి 10:50 గంటల నుంచి అర్ధరాత్రి 12:45 గంటల వరకు
  • సింహ లగ్న పూజా ముహుర్తం : ఉదయం 5:55 గంటల నుంచి ఉదయం 7:42 గంటల వరకు
  • వృశ్చిక లగ్నం పూజా ముహుర్తం : మధ్యాహ్నం 12:17 గంటల నుంచి మధ్యాహ్నం 2:36 గంటల వరకు
  • కుంభ లగ్నం పూజా ముహుర్తం : సాయంత్రం 6:12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
  • రాహుకాలం : 25 ఆగస్టు 2023 శుక్రవారం ఉదయం 10:52 గంటల నుంచి మధ్యాహ్నం 12:25 గంటల వరకు
  • యమ గండం : 25 ఆగస్టు 2023 శుక్రవారం మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:04 గంటల వరకు
  • వర మహాలక్ష్మీ 2023 పూజకు అనుకూలమైన సమయం : 25 ఆగస్టు 2023న ఉదయం 9:15 గంటలకు పూజను ప్రారంభించొచ్చు.

పూజా విధానం..

వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలనే ధరించాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా గదిలో కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు వాడే వస్త్రం కాటన్‌దే అయ్యుండాలి. పాలిస్టర్ లేదా సింథటిక్ దుస్తులను ధరించి పూజించొద్దు.

కలశ స్థాపనలో..

పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్‌తో అలంకరించాలి. అనంతరం పసుపు, కుంకుమ, గంధం కలిపిన మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయాలి. కలశంలో బియ్యం లేదా నీరు, నాణేలు, ఐదు రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి. చివరగా మామిడాకులను కలశంపై ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు పసుపు రాసి దానిపై ఉంచాలి. అనంతరం అమ్మవారిని అలంకరించాలి. పూజలో భాగంగా ఐదు రకాల పండ్లు, నైవేద్యాన్ని సమర్పించాలి. వ్రతం నిర్వహించిన రోజున సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి.

ఈ మంత్రాలను పఠించాలి..

వర మహాలక్ష్మీ వ్రతం చేసేవారంతా ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతారు. అంతేకాదు మీ కుటుంబం, మీ భాగస్వామి ఆయువు కూడా పెరుగుతుందని నమ్ముతారు.