వృత్తివిద్యా కోర్సుకు సార్లు లేరు

వృత్తివిద్యా కోర్సుకు సార్లు లేరు
  • సిరిసిల్లలో 13 కేజీబీవీలు 7 విద్యాలయాల్లో లేని ఇన్​స్ట్రక్టర్లు
  • మెటీరియల్ లేక థియరీ క్లాసులు చెబుతున్న టీచర్లు
  • శిక్షణకు దూరమవుతున్న స్టూడెంట్లు


రాజన్న సిరిసిల్ల, వెలుగు : విద్యార్థులు చదువుతోపాటు వృత్తివిద్య కోర్సులు నేర్చుకునేందుకు ప్రభుత్వం కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల)లలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టింది. అయితే జిల్లాలోని 7  విద్యాలయాల్లో కోర్సులు బోధించడానికి ఇన్​స్ట్రక్టర్లను నియమించకపోవడంతో విద్యార్థులు వృత్తివిద్యకు దూరమవుతున్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్​తోపాటు కుట్టు, మగ్గం వర్క్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్​మేకింగ్ తదితర కోర్సులు నేర్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. అయితే స్టాఫ్ లేకపోవడంతో ఒకేషనల్ కోర్సులలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించలేకపోతున్నారు. 

ఇన్​స్ట్రక్టర్ల కొరత..

సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 13 కేజీబీవీలు ఉండగా 3,241 మంది విద్యార్థులు చదువుతున్నారు. 7 విద్యాలయాల్లో వృత్తి విద్య కోర్సుల ఇన్​స్ట్రక్టర్లు లేరు. అర్బన్, సిరిసిల్ల, వీర్నపల్లి, బోయిన్​పల్లి, గంభీరావుపేట, మర్రిపల్లి, రుద్రంగి కేజీబీవీల్లో ఒకేషనల్ ఇన్​స్ట్రక్టర్లు లేకపోవడంతో శిక్షణకు దూరమవుతున్నారు.

మూసివేత దిశగా పాత సెంటర్లు.. 

వృత్తి విద్యా కోర్సులు బోధించేందుకు 1985లో కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో, సిరిసిల్ల గీతానగర్ లో సెంటర్లు ఏర్పాటు చేసింది. ముస్తాబాద్ సెంటర్ మూసివేయగా సిరిసిల్ల  గీతానగర్ లో ఒకేషనల్ కోర్సులు బోధిస్తున్నారు. కాని ఇందులో ప్రాక్టికల్స్ చేసేందుకు మెటీరియల్ లేకపోవడంతో కేవలం థియరీ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. ఈ సెంటర్ లో 170 మంది విద్యార్థులు వృత్తి విద్యా కోర్సు బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రాక్టికల్ మెటీరియల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు.

బిల్డింగ్ లేక మెటీరియల్ మూలకు.. 

2016న సిరిసిల్ల జిల్లా ఏర్పడినప్పుటి నుంచి ఎస్పీ ఆఫీస్ కోసం జిల్లా కేంద్రంలోని గీతానగర్ హై స్కూల్ ఒకేషనల్ కోర్సు బిల్డింగ్ ను ఎస్పీ కార్యాలయానికి వినియోగిస్తున్నారు. దీంతో వృత్తివిద్య కోర్సులకు సంబంధించిన మెటీరియల్ ను ఓ గదిలో పడేశారు. మరోవైపు మెటీరియల్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయకపోవడంతో థియరీ క్లాసులు మాత్రమే నడుపుతున్నారు. ప్రాక్టికల్ క్లాసులు లేకపోవడంతో వృత్తి నైపుణ్యాలు నేర్చుకోలేకపోతుమని విద్యార్థులు వాపోతున్నారు. 

థియరీ క్లాస్ లే వింటున్నాం

నేను ఒకేషనల్ క్లాస్ లు రోజూ వింటాను. ప్రస్తుతం థియర్ క్లాస్ లు మాత్రమే జరగుతున్నాయి. మెటీరియల్ లేకపోవడంతో ప్రాక్టికల్స్ జరుగుతలేవు. కుట్టు మిషన్లు పాడవడంతో స్కూల్ లో ఓ మూలన పడేశారు. చేతితో కుట్టడం, అల్లడం మాత్రం నేర్చుకుంటున్నాం.   

రక్షిత, స్టూడెంట్‌, గీతానగర్ స్కూల్​