
- డెడ్ స్టోరేజీలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు
- భారీ వర్షాలపైనే రైతుల ఆశలు
మహబూబ్నగర్/వనపర్తి, వెలుగు: 2025 వానాకాలం సీజన్ పంటల సాగు ప్రణాళికను ఆఫీసర్లు ఖరారు చేశారు. అనుకున్న విధంగానే ఈసారి కూడా వరి ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు తగినట్లు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మేర విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండగా.. మిగతా వాటి కోసం ఇండెంట్ పెట్టి తెప్పించనున్నారు.
నారాయణపేటలో పత్తి ఎక్కువ..
నారాయణపేట జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు పత్తి ఎక్కువగా వేసే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ భావిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 1.80 లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సీజన్లో కూడా 1.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.40 లక్షల ఎకరాలు కాగా.. ఏకంగా ఈ సీజన్లో 30 వేల ఎకరాలకు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ లెక్కల ప్రకారం వ్యవసాయ శాఖ జిల్లాలో 1.75 లక్షల్లో వరి పంటలు సాగువుతాయని రిపోర్ట్ ఇచ్చింది. అలాగే కంది 70 వేల ఎకరాల్లో, జొన్నలు 5 వేల ఎకరాల్లో, పెసర 5 వేల ఎకరాల్లో, ఇతర పంటలు వెయ్యి ఎకరాల్లో సాగవుతాయని అంచనా ఉంది. వనపర్తి జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 2.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ఆ శాఖ అంచనా వేసింది. అయితే అత్యధికంగా వరి 2.05 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేసింది. అలాగే పత్తి, కందులు, మొక్కజొన్న, వేరుశనగ, హార్టికల్చర్ పంటలను వేయించాలని నిర్ణయించారు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా వరి సాగు విస్తీర్ణం పెరగనుంది. గతేడాది ఇదే సీజన్లో 1.70 వేల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ ఏడాది మాత్రం 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా ఉంది. పత్తి కూడా నిరుడులాగే 2 లక్షల ఎకరాల్లో సాగవుతుందనే అంచనా
ఉంది.
వర్షాలపైనే ఆధారం..
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. వీటి కింద ఉన్న ఎత్తిపోతల పథకాలను దాదాపు ఐదు నెలలుగా బంద్ పెట్టారు. గత యాసంగి పంటలకు కూడా సాగునీరు అందించే పరిస్థితి లేక కాలువల కింద వారబందీ ప్రకటించారు. చాలా మంది రైతులు యాసంగిలో వరి సాగుకు దూరం అయ్యారు. కేవలం బోర్ల ఆధారంగా మాత్రమే పంటలు సాగయ్యాయి. అయితే వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండటానికి దాదాపు నెల రోజుల పట్టే అవకావం ఉంది. సాధారణంగా జూరాల ప్రాజెక్టుకు జూన్ రెండో వారం నుంచి వరద ప్రారంభం కావాల్సి ఉండగా.. ఐదారేండ్లుగా జులై లేదా ఆగస్టు నుంచి వరదలు వస్తున్నాయి. దీని ప్రకారం ఇక్కడి ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటీకి చేరుకోవడానికి జులై చివరి వారం లేదా ఆగస్టు వరకు టైం పట్టే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడితే తప్ప ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు.
నెల ముందు వేస్తేనే..
వరి సాగుకు దిగుతున్న రైతులు వానాకాలం పంటలను నెల రోజుల ముందు వేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచనలు చేస్తోంది. ప్రధానంగా సెప్టెంబర్, అక్టోబర్లో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడం.. దీని ప్రభావంతో నవంబర్లో పంట చేతికొచ్చే సమయంలో తీవ్రమైన చలి వల్ల కంకులు దెబ్బతింటున్నాయి. ఈ కోతలు కోసి పంట అమ్ముకునే సరికి దాదాపు డిసెంబరు చివరి వారం నుంచి జనవరి వరకు సమయం పడుతోంది.
ఆ తర్వాత యాసంగి సాగుకు దిగుతున్న రైతులకు వరి పంటలు పొట్టకొచ్చే దశలో తీవ్రమైన సాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వానాకాలం వరి సాగుకు దిగుతున్న రైతులు జూన్ మొదటి వారంలోనే నార్లు పోసుకొని.. రెండో వారం నుంచే నాట్లు పెట్టుకుంటే మేలని సూచనలు చేస్తున్నారు.