
వనపర్తి, వెలుగు: ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. పనుల వివరాలను ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాటు కూలీల జాబ్ కార్డులను ఆధార్ కార్డులకు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేశారు. అయినప్పటికీ కొందరు పనికి రాకున్నా హాజరు వేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆఫీసర్లు నిధులు దురినియోగం కాకుండా అరికట్టేందుకు ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల్లో ఈ ప్రక్రియను ముమ్మరం చేశారు.
వనపర్తి జిల్లాలో 51శాతం కంప్లీట్..
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 1,21,009 మంది కూలీలు పని చేస్తుండగా, 1,21,003 మంది ఆధార్ అనుసంధానం పూర్తి చేశారు. వీరిలో 61,770 మంది ఈకేవైసీ కంప్లీట్ అయిందని, 51శాతం ఈకేవైసీ పూర్తి చేయగా, మిగిలిన వారి ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఆన్లైన్లో హాజరు నమోదు..
ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన కూలీల ఈకేవైసీని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఉపాధి పనుల్లో హాజరు నమోదవుతుంది. గ్రామాల్లో నిర్దేశించిన పని ప్రదేశానికి కూలీ రాగానే, ఫీల్డ్ అసిస్టెంట్ సెల్ఫోన్లో ఈకేవైసీ తీసుకుంటాడు. పనులు పూర్తయి ఇంటికి వెళ్లే సమయంలో మరోసారి కూలీ ఫొటో తీసి అప్లోడ్ చేస్తాడు. రెండు సార్లు తీసిన ఫొటోలు యాప్‌లో సరిగా నమోదైతేనే కూలీల ఖాతాల్లో డబ్బులు జమఅవుతాయి. దీంతో బినామీలకు చెక్ పడుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశంలోనే పనుల వివరాలను నమోదు చేస్తుండడంతో అవకతవకలు తగ్గుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
జిల్లాలో ఈకేవైసీ వివరాలు ఇలా..
అమరచింత మండలంలో 5,004 మందికి గాను 3,599 మంది ఈకేవైసీ, ఆత్మకూరులో 6,110 మందికి గాను 2,553, చిన్నంబావిలో 9,624 మందికి గాను 5,999, ఖిల్లాగణపురంలో 9,729 మందికి గాను 4,595 మంది, గోపాల్‌పేటలో 7,456 మందికి గాను 3,896, కొత్తకోటలో 9,721 మందికి గాను 5,948 మంది, మదనాపురంలో 7,379 మందికి గాను 3,478 మంది, పాన్గల్లో 13,908 మందికి గాను 7,388 మంది, పెబ్బేరులో 11,181 మందికి గాను 3,599 మంది, పెద్దమందడిలో 8,145 మందికి గాను 3,886 మంది, రేవల్లిలో 4,026 మందికి గాను 2,421 మంది, శ్రీరంగాపురంలో 6,464 మందికి గాను 4,053 మంది, వీపనగండ్లలో 9,372 మందికి గాను 4,820 మంది, వనపర్తిలో 10,168 మందికి గాను 5,512 మంది, ఏదుల మండలంలో 2,722 మందికి గాను 1,162 మంది ఈకేవైసీని కంప్లీట్ చేశారు.