
హనుమకొండ, వెలుగు: హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న ఓ వృద్ధుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో టీఏవీఐ(ట్రాన్స్ కేథటర్ ఏయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్/రీప్లేస్మెంట్) ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించి, అతడి ప్రాణాలు కాపాడినట్లు మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజీ డైరెక్టర్, స్ట్రక్షరల్ హార్ట్ అండ్ అడ్వాన్స్డ్ కరోనరీ ఇంటర్వెషనల్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకంటి తెలిపారు. హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్ లో బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
వరంగల్ కు చెందిన ఓ వృద్ధుడు మూడేండ్ల నుంచి ఛాతి నొప్పి, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నాడన్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా, గుండెలోని ప్రధాన కవాటంలో కాల్షియం పేరుకుపోయి ఇరుకుగా మారిందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీతో సంబంధం లేకుండా తొడ భాగంలోని ధమని ద్వారా అత్యాధునిక టీఏవీఐ ప్రక్రియలో ఆపరేషన్ సక్సెస్ చేశామన్నారు. 48 గంటల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాడని, సాధారణంగా మెట్రో నగరాల్లో మాత్రమే లభించే ఈ ఆధునిక చికిత్స ఇప్పుడు వరంగల్‌లోనే అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.