పచ్చదనానికి ప్రపంచ రికార్డ్​ 

పచ్చదనానికి ప్రపంచ రికార్డ్​ 

పది రోజులు..లక్షా ఇరవై మూడువేల ఐదువందల మంది మహిళలు. రెండు కోట్ల 8 లక్షల సీడ్​ బాల్స్​.  వాటిలో73,918 సీడ్ బాల్స్​తో  పేర్చిన  ఇంగ్లీష్​ వాక్యం. ఇది మహబూబ్​నగర్​ మహిళా సమాఖ్య సాధించిన విజయం. ఈ విజయానికి దక్కిన అరుదైన గౌరవం గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ ​ రికార్డ్​.

చుట్టూ చెట్లు ఉంటే మనిషి బాగున్నట్టే అని నమ్మారు మహబూబ్​నగర్​ మహిళా స్వయం సంఘాల  సభ్యులు. అందుకే  కిందటి ఏడాది   గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా 10 రోజుల్లో కోటి 18 లక్షల  విత్తన బంతులు తయారు చేశారు. వాటిని   ప్రభుత్వ స్థలాలు, బంజర భూముల్లో చల్లారు. పచ్చదనానికి ఊపిరి పోసినందుకు పోయిన ఏడాది గిన్నిస్​ బుక్​ ఆఫ్​  రికార్డ్స్​కి  కూడా ఎక్కారు. ఈ సారి ఆ రికార్డ్​ని బ్రేక్​ చేస్తూ పదిరోజుల్లో  రెండు కోట్ల ఎనిమిది లక్షల సీడ్​ బాల్స్​ తయారుచేశారు.  అంతేనా వాటిలోని 73, 918 బంతులతో రెండు గంటల్లో అతి పెద్ద వాక్యం‘టూ క్రోర్‌‌ సీడ్‌‌ బాల్స్‌‌ మేడ్‌‌ అండ్‌‌ ప్లాంటెడ్‌‌ బై ఎస్‌‌హెచ్‌‌జీ ఉమెన్‌‌ ట్రాన్స్‌‌ఫామ్‌‌ మహబూబ్‌‌నగర్‌‌ ఇన్‌‌ టు హెటిరో గ్రీన్‌‌ బెల్ట్‌‌’ అని రాసి  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దృష్టిని ఆకర్షించారు.   
పైసా తీసుకోకుండా
మొదట మహిళా సంఘాల సభ్యులు జిల్లాలో పది లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం అయ్యారు..కానీ జిల్లా కలెక్టర్​ ఎస్. వెంకట్రావు చూపు సీడ్​ బాల్స్​ వైపు మళ్లింది.  కిందటి ఏడాది ఉమ్మడి జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో  సీడ్ బాల్స్​ను తయారు చేసి హెలికాప్టర్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్ లో చల్లారు. దాన్ని  ఆదర్శంగా తీసుకుని జిల్లా కలెక్టర్​ మహిళల్ని ఈ పచ్చని సంకల్పం వైపు అడుగులు వేయించారు. రావి, మర్రి, వేప, చింత, సీతాఫలం, నల్ల తుమ్మ, జువ్వి, నెమలినార, గానుగ, మేడి, రేల విత్తనాల  సీడ్​ బాల్స్​ని 70శాతం జల్లెడ పట్టిన ఎర్రమట్టి, 30 శాతం పశువులపేడ, గోమూత్రంతో తయారుచేశారు. వీళ్లంతా పైసా తీసుకోకుండా ఈ సీడ్​ బాల్స్​ తయారుచేయడం మరో విశేషం. 

సంతోషంగా ఉంది
మేం తయారుచేసిన సీడ్ బాల్స్​కు వరల్డ్ రికార్డ్ రావడం సంతోషంగా అనిపిస్తోంది.. కలెక్టర్, డీ ఆర్ డీ ఏ అధికారుల ఆదేశాల మేరకే మేము ఈ సీడ్ బాల్స్ తయారుచేశాం. ముందుముందు ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటా.  - దేవమణి, ఆరాధన మహిళా సంఘం, మిడ్జిల్  :: మహబూబ్​ నగర్​, వెలుగు