కొత్త​ కేసుల్లో 90% ‘ఎక్స్​బీబీ’వే!

 కొత్త​ కేసుల్లో 90% ‘ఎక్స్​బీబీ’వే!

న్యూఢిల్లీ:  కరోనా కొత్త వేరియంట్​ ‘ఎక్స్ బీబీ.1.16’  మరిన్ని మ్యుటేషన్లకు గురవుతోంది. దానిలోని సబ్​టైప్​ కు చెందిన ‘ఎక్స్ బీబీ.1.16.1’ వైరస్​కు సంబంధించిన 113 కేసులు ఇప్పటివరకు దేశంలో వెలుగు చూశాయి. ఎక్కువగా గుజరాత్​, మహారాష్ట్రల్లోనే బయటపడ్డాయి.  ‘ఎక్స్​బీబీ’ విషయానికి వస్తే.. ఇది ఒమైక్రాన్​ రకానికి చెందిన కరోనా వైరస్​లో  ఒక సబ్​ టైప్​. దేశంలో గత 15 నెలల్లో నిర్ధారణ అయిన ఒమైక్రాన్​ కరోనా వేరియంట్ ​కేసుల్లో ఇలాంటి  400 కొత్త సబ్​ టైప్​వేరియంట్లను గుర్తించారు. 

అయితే వీటిలో 90% కేసులకు ఎక్స్​బీబీ వేరియంటే కారణమైందని వెల్లడైంది. జీనోమ్​ సీక్వెన్సింగ్​ డేటాను నిక్షిప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఇన్సా కాగ్’ (ఐఎన్​ఎస్ఏ సీవోజీ) వెబ్​ పోర్టల్​లో ఇంకా ‘ఎక్స్ బీబీ.1.16.1’ అనే కొత్త కరోనా వేరియంట్​వివరాలను లిస్ట్​ చేయలేదు. ​దీనివల్ల సోకే ఇన్ఫెక్షన్​ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేందుకు పెద్దగా ఆధారాలేంలేవు. ఇటీవల ‘ఇన్సా కాగ్’ విడుదల చేసిన బులెటిన్​లో .. ‘‘ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో ఎక్స్​బీబీ.1.16 వేరియంట్ ​కేసులు 38.2% ఉంటాయి”అని వెల్లడించింది. దీని బారినపడిన వారిలోనూ ఒమైక్రాన్​ వేరియంట్​​తరహా లక్షణాలే బయటపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో 6,155 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31,194కు పెరిగింది. మరో 11 మంది కరోనాతో చనిపోయారు.  ప్రత్యేకించి ఢిల్లీలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 733 మందికి కరోనా నిర్ధారణ అయింది.  మార్చి 30 నుంచి ఏప్రిల్​ 7 మధ్యకాలంలో దేశ రాజధానిలో 3,800కుపైగా కేసులు నమోదయ్యాయి.