లక్ష మందితో షర్మిల శంఖారావం

లక్ష మందితో షర్మిల శంఖారావం

భారీ చేరికలకు ప్లాన్..​​  ఖమ్మంపై స్పెషల్​ ఫోకస్

​​ఖమ్మం, వెలుగు: వచ్చే నెల 9న ఖమ్మం నగరంలో నిర్వహించనున్న బహిరంగ సభ సక్సెస్ పై వైఎస్​ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీ పేరు, విధి విధానాలతో పాటు జెండా, ఎజెండాలను ఈ మీటింగ్ లోనే ప్రకటించనున్నారు. దీంతో రెగ్యులర్​గా ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె సమావేశమవుతున్నారు. ఖమ్మం నుంచి లోటస్​పాండ్​కు వచ్చినవారికి స్పెషల్​ ప్రయారిటీ ఇస్తూ, సభకు సంబంధించిన ఏర్పాట్లపై డిస్కస్​చేస్తున్నారు. ఇప్పటివరకు సొంత పార్టీ ఏర్పాట్లకు సంబంధించి అంతర్గత సమావేశాలు, ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్​అభిమానులతో సమావేశమయ్యారు. అయితే బహిరంగ సభ ఇదే మొదటిది కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నేతలు కూడా పబ్లిక్ మీటింగ్ ఎలా జరుగుతుందనే దానిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఎవరి అంచనాలకు తగ్గకుండా కనీసం లక్ష మందితో నగరంలో సభ నిర్వహించాలని షర్మిల అనుచరులు ప్లాన్​చేస్తున్నారు. ఇందుకోసం పెవిలియన్​గ్రౌండ్, ఎస్ఆర్ అండ్​బీజీఎన్ఆర్ ​కాలేజీ గ్రౌండ్​లను ముఖ్య నేతలు పరిశీలించారు. ఇప్పటికే పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేశారు. డిగ్రీ కాలేజీ గ్రౌండ్ కు పోలీసుల గ్రీన్​ సిగ్నల్ వచ్చినట్టు నేతలు చెబుతున్నారు. ఇక జన సమీకరణ కోసం మండల స్థాయిలో ముగ్గురి నుంచి ఐదుగురితో కమిటీ వేయాలని ప్లాన్​ చేస్తున్నారు. హైదరాబాద్​ నుంచి వెహికల్స్​తో ర్యాలీగా షర్మిల ఖమ్మం రావాలని నిర్ణయించగా, ఈ ర్యాలీతో పాటు బహిరంగ సభా ప్రాంగణంపై పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైకి చెందిన ప్రైవేట్ ఏవియేషన్​ కంపెనీ ప్రతినిధులతో దీనిపై మాట్లాడి, హెలికాప్టర్​కు అడ్వాన్స్​ చెల్లించినట్టు షర్మిల అనుచరులు చెబుతున్నారు.  
ఇప్పటికే కొందరు..
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగి తొలి ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీ ఒక పార్లమెంట్ స్థానాన్ని, మూడు అసెంబ్లీ సీట్లను గెల్చుకుంది. దీంతో షర్మిలను ఖమ్మం అసెంబ్లీ సీటు లేదా పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడి నేతలు సూచిస్తున్నారు. అప్పట్లో వైసీపీ నుంచి గెలిచిన వాళ్లంతా ప్రస్తుతం టీఆర్ఎస్​లో ఉన్నారు. అప్పట్లో ఎంపీగా గెల్చిన పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తాను షర్మిల పార్టీలో చేరబోనని స్పష్టంగా ప్రకటించారు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలను కూడా షర్మిల అనుచరులు సంప్రదించినట్టు సమాచారం. అయితే ఎవరూ షర్మిల పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు ఇష్టపడడంలేదు. గత వారం మధిర నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్​ నేత, భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, ఆయన భార్య, మధిర వైస్​ చైర్ పర్సన్ ​శీలం విద్యాలత హైదరాబాద్​లో షర్మిలను కలిసి ఆమె పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వచ్చే నెల 9న జరగబోయే మీటింగ్ సంబంధించి మధిర నియోజకవర్గంలో కేడర్​ సమీకరణపై ప్రస్తుతం వాళ్లు పనిచేస్తున్నారు. అయితే షర్మిల పార్టీతో టచ్​లోకి వెళ్లకుండా సొంత పార్టీ నేతలపై టీఆర్ఎస్ ​దృష్టి పెట్టింది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎప్పటికప్పుడు లీడర్లు మాట్లాడుతున్నారు. షర్మిలను కలిసి వచ్చిన తర్వాత శీలం వెంకటరెడ్డి, విద్యాలతతో జడ్పీ చైర్మన్, మధిర టీఆర్ఎస్​ ఇన్​చార్జి లింగాల కమల్ రాజు చర్చించారు. పార్టీలోనే కంటిన్యూ కావాలని బుజ్జగించినట్టు తెలుస్తోంది. వాళ్లిద్దరూ టీఆర్ఎస్​తోనే ఉంటారని ఆ పార్టీ నేతలు ప్రకటన కూడా విడుదల చేశారు. తర్వాత రోజే టీఆర్ఎస్​కు రిజైన్​ చేస్తున్నట్టు వెంకటరెడ్డి ప్రకటించారు. దీంతో మరెవరూ టీఆర్ఎస్​ను వీడకుండా లీడర్లు అలర్టయ్యారు. ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సొంత పార్టీ లీడర్ల కదలికలపై అధికార పార్టీ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టు సమాచారం.