వ్యవసాయ యాంత్రీకరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం .. గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు

వ్యవసాయ యాంత్రీకరణకు  యాక్షన్ ప్లాన్ సిద్ధం ..  గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాకు రూ.6.18 కోట్లు మంజూరు 
  • వచ్చే నెల 5 నుంచి అప్లికేషన్ల స్వీకరణ
  • సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు పరికరాల పంపిణీ

నల్గొండ, వెలుగు : వ్యవసాయ యాంత్రీకరణకు జిల్లా యంత్రాంగం  యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే మంచిదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి  నూతన మార్గదర్శకాలను గత వారం విడుదల చేశారు. దీంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు కొత్త గైడ్ లైన్స్ అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు సన్నాహాలు 
ప్రారంభించారు.  

ఉమ్మడి నల్గొండ జిల్లాకు రూ.6.18 కోట్లు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం రూ.6.18 కోట్లు కేటాయించింది. ఇందులో నల్గొండ జిల్లాకు రూ.3.14 కోట్లు, సూర్యాపేట జిల్లాకు రూ.1.84 కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.24 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ ఇస్తుండగా, జనరల్‌‌ కేటగిరీ రైతులకు 40 శాతం సబ్సిడీ వర్తించనుంది. 

వచ్చే నెల 5 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి వచ్చే నెల 5 నుంచి 15 వరకు రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. వ్యవసాయాధికారులు అన్ని దరఖాస్తులను కలెక్టర్లకు నివేదిస్తారు. కలెక్టర్లు ఆగస్టు 16 నుంచి 20 వరకు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాన్ని రైతులకు తెలియజేస్తారు. ఆగస్టు 21 నుంచి 27 వరకు ఎంపికైన రైతుల నుంచి డీడీలు తీసుకుంటారు. 

27 నుంచి సెప్టెంబర్​5 వరకు మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. సెప్టెంబరు 7 నుంచి 17లోగా రైతులకు పరికరాలు పంపిణీ చేస్తారు. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు వ్యవసాయశాఖ అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. 

15 రకాల పరికరాల గుర్తింపు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగేండ్లపాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కొనసాగగా, ఆ తరువాత ఆరేండ్లపాటు నిలిచిపోయింది. ఈ పథకాన్ని అమలు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్‌‌ చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది యాసంగి నుంచే రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఉమ్మడి జిల్లాల వ్యవసాయశాఖ అధికారుల నుంచి నివేదికలు తీసుకుంది. 

రైతులకు అందజేయాల్సిన పనిముట్లు, 15 రకాల యంత్ర పరికరాల జాబితాను రూపొందించారు. అందులో రోట వేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, స్ర్పేయర్లు, పవర్‌‌వీడర్లు, డ్రోన్లు ఉన్నాయి.