
జనగామ, వెలుగు : ఫ్రెండ్ షిప్ పేరుతో యువతిని మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డ 10 మందిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి స్నేహం పేరుతో పలువురు యువకులు దగ్గరయ్యారు. ఈ క్రమంలో జూన్ నెలలో సూర్యాపేట రోడ్‌లోని ఓ ఇంట్లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని యువతిని నమ్మించి ఇటీవల గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారం చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న యువతి చిన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జనగామ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన మహ్మద్ ఒవైసీ, ఎండీ.అబ్దుల్ ఖయ్యూం, గీతానగర్‌కు చెందిన ముత్యాల పవన్‌కుమార్, బాణాపురానికి చెందిన బొద్దుల శివకుమార్, లింగాల ఘన్‌పూర్ మండలం నెల్లుట్లకు చెందిన నూకల రవి, జనగామకు చెందిన ఓ వ్యాపారి జెట్టి సంజయ్, కుర్మవాడకు చెందిన పుస్తకాల సాయితేజ, ముత్తడి సుమంత్‌రెడ్డి, గుండాసాయిచరణ్‌రెడ్డి, ఓరుగంటి సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి మూడు మొబైల్స్, టయోట గ్లాంజా కారును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై భరత్, చెన్నకేశవులు, కానిస్టేబుళ్లు రామకృష్ణ, కరుణాకర్, కృష్ణ, మహేందర్, అరవింద్, చరణ్, ఏసీపీ ఆఫీఫ్ రైటర్ మాధవ్‌కుమార్‌ను ఏసీపీ అభినందించారు.