హైదరాబాద్​లో ఒక్క నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు

హైదరాబాద్​లో ఒక్క నెలలో  10 లక్షల బిర్యానీ ఆర్డర్లు
  • దేశవ్యాప్తంగా 60 లక్షల బిర్యానీ, 5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు
  • రంజాన్ ఎఫెక్ట్​తో 15 శాతం పెరిగాయన్న స్విగ్గీ

హైదరాబాద్, వెలుగు: ఆన్​లైన్ ఫుడ్ ఆర్డర్లలో హైదరాబాద్ బిర్యానీ మరోసారి టాప్​లో నిలిచింది. రంజాన్​మాసం ఎఫెక్ట్​తో ఈ ఆర్డర్లు భారీగా పెరిగాయని ప్రముఖ ఆన్​లైన్ ఫుడ్ డెలివరి సంస్థ స్విగ్గీ వెల్లడించింది. నెల రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఇందులో 10 లక్షల బిర్యానీ, 5.3 లక్షల హలీమ్​ఆర్డర్లతో హైదరాబాద్​ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతినెలా వచ్చే ఆర్డర్లతో పొల్చితే ఇది 15 శాతం ఎక్కువని వివరించింది. రంజాన్​మాసం ఎఫెక్ట్​తోనే ఇంతలా ఆర్డర్లు పెరిగాయని తెలిపింది. ఈ నెలలో బిర్యానీ, హలీంలతో పాటు సమోసాలు, భాజియా, మల్పువా, ఫిర్ని, రబి లాంటి వంటకాలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయంది.

డ్రైఫ్రూట్స్, ఫ్రూట్సలాడ్స్ కు కూడా భారీగా ఆర్డర్స్ వచ్చాయని పేర్కొంది. హలీమ్ ఆర్డర్లు 1454.88 శాతం పెరగ్గా, ఫిర్ని 80.97 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57.93 శాతం, డేట్స్ 48.40 శాతం పెరిగాయని స్విగ్గీ పేర్కొంది. రంజాన్ ఉపవాసాల ప్రభావంతో సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల టైమ్​లో ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ముస్లింలు తమ ఉపవాస దీక్ష విరమించేందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకే ఎక్కువ మొగ్గు చూపినట్లు చెప్పింది. ముంబై, కోల్​కతా, లక్నో, భోపాల్, మీరట్​లో కూడా ఆర్డర్లు పెద్ద సంఖ్యలో పెరిగాయని స్విగ్గీ తెలిపింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు చేసిన ఆర్డర్ల విశ్లేషణ ఆధారంగా ఈ రిపోర్ట్ విడుదల చేసింది.