
- ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు మొడెం బాలకృష్ణ
- తొమ్మిది నెలలుగా బాలకృష్ణ టార్గెట్‌గా భద్రతా బలగాల వేట
- ఆయన తలపై రూ. కోటి రివార్డ్
- ఏడాదిలో ముగ్గురు కీలక నేతలను కోల్పోయిన ఒడిశా స్టేట్ కమిటీ
భద్రాచలం, వెలుగు:
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గణపవరం మండలానికి చెందిన మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ (58) ఉన్నారు. బాలకృష్ణపై కోటి రూపాయల రివార్డు ఉన్నది.
గరియాబంద్ జిల్లా మైన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో భాలూ డిగ్గీ గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమరేశ్ మిశ్రా ఆదేశాలతో గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రాకోచా ఆధ్వర్యలో ఈ-30, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలను రంగంలోకి దించారు. కూంబింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో రెండు వర్గాలకు మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి.
మావోయిస్టుల పారిపోతూ కూడా కాల్పులు జరపడంతో మైన్పూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లింది. వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో 10 మంది నక్సల్స్ మృతదేహాలను, ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఉన్నట్లు గుర్తించారు. ఎన్కౌంటర్ ప్రదేశం ఒడిశాలోని నువాపాడా జిల్లాకు సరిహద్దులో ఉంది. అప్పటికే రాత్రి కావడంతో సెర్చింగ్ ఆపరేషన్ నిలిపివేశారు.
9 నెలలుగా ఆపరేషన్ మొడెం బాలకృష్ణ
కేంద్ర కమిటీ సభ్యుడైన మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఒడిశా రాష్ట్ర కమిటీ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా స్టేట్ మెంబర్ చలపతి కూడా ఉన్నారు. వీరిలో 12 మందిపై రూ.3.16కోట్ల రివార్డు ఉంది. ఇందులో మొడెం బాలకృష్ణ కూడా ఉంటారని అనుమానించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణను చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల సాయంతో టార్గెట్ చేశారు. 9 నెలలుగా ఆయన్ను వెంటాడుతున్నారు. ఒడిశాలోని కంధమాల్–-కల్హండి–బౌధ్–-నయాగఢ్(కేకేబీఎన్) డివిజన్‌ను పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ అలియాస్ మనోజ్ వివరాలు ఇన్ఫార్మర్ల ద్వారా సేకరించిన భద్రతాబలగాలు చత్తీస్‌గఢ్ అడవుల్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. ఈ పక్కా సమాచారంతో తాజా ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నది.
ఏవోబీలో అలర్ట్
మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో ఏవోబీ(ఆంధ్రా-–ఒడిశా బార్డర్) చాలా కీలకమైనది. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కూడా ఇది బార్డర్లో ఉంటుంది. వరుస ఘటనల్లో ముగ్గురు కీలకనేతలను ఈ ఏడాది ఒడిశా స్టేట్ కమిటీ కోల్పోయింది. జనవరి 22న చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ జయరాం, జూన్ 19న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి చనిపోయారు. ఏఓబీలో వీరిద్దరూ కీలకమైన నేతలు. వీరిద్దిరితో పాటు తాజాగా మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ కూడా చనిపోవడంతో మావోయిస్టులు దాడులకు దిగే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏఓబీలోభద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.