ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లపై జీవో జారీ

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లపై జీవో జారీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్టీలకు10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్‌ 1 నుంచే విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ కోటా అమల్లోకి వస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా 6% నుంచి10 శాతానికి రిజర్వేషన్‌ పెంచాలని 33 గిరిజన తెగలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 17న జరిగిన ఆదివాసీ, గిరిజన భవనాల ప్రారంభోత్సవంలో రిజర్వేషన్ల పెంపు జీవోను వారంలో విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఎట్టకేలకు ప్రభుత్వం జీవోనం.33 జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అమలవుతున్న 6 శాతం రిజర్వేషన్ల విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇన్నాళ్లూ అమలు చేస్తూ వచ్చింది. ప్రస్తుత నోటిఫికేషన్ తో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.

గత 28 ఏండ్లుగా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తమిళనాడులో పెరిగిన రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం ద్వారా కేంద్రం.. రాజ్యాంగ బద్ధత కల్పించింది. ఇందిరా సావ్నేయ్ కేసులో రిజర్వేషన్లు 50 శాతంలోపే ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని తెలిపింది. సీఎం కేసీఆర్ ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాకే గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.