
న్యూఢిల్లీ: ఇండియా స్టాక్ మార్కెట్లు ఈ వారం పాజిటివ్‌గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గిస్తామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ నెల 22న గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా కదిలాయి. ఈ ఎఫెక్ట్‌తో సోమవారం మన మార్కెట్లు లాభాల్లో ఓపెన్ అవ్వొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. గిఫ్ట్ నిఫ్టీ శుక్రవారం సెషన్‌ను అర శాతం లాభంతో ముగించింది. మరోవైపు ఈ నెల 27 నుంచి భారత వస్తువులపై అమెరికా విధించిన అదనపు 25 శాతం టారిఫ్ అమల్లోకి రానుంది. దీంతో ఇండియాపై ట్రంప్ టారిఫ్‌లు 50 శాతానికి పెరుగుతాయి.
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇండియా మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడంతో కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉంది. ఈ వారం అమెరికా, చైనా ఎకనామిక్ డేటా, ఇండియా జీడీపీ, ఐఐపీ డేటా వెలువడున్నాయి. వీటిపై ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు అన్నారు. గణేశ చతుర్థి సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 709 పాయింట్ల (0.87శాతం) లాభంతో, నిఫ్టీ 238.8 పాయింట్ల (0.96శాతం) లాభంతో ముగిశాయి.