దక్షిణ మధ్య రైల్వేకు 10 వేల కోట్లు

దక్షిణ మధ్య రైల్వేకు 10 వేల కోట్లు
  • తెలంగాణకు రూ.3,048 కోట్లు, ఏపీకి రూ.7,030 కోట్లు 

హైదరాబాద్‌, వెలుగు: కేంద్రం ఈసారి బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.10,208 కోట్లు కేటాయించింది. పోయినేడాది రూ.7,222 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,986 కోట్లు ఎక్కువ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో మన రాష్ట్రానికి రూ.3,048 కోట్లు కేటాయించింది. పోయినేడు రూ.2,420 కోట్లు ఇవ్వగా, ఈసారి 26 శాతం నిధులు పెంచింది. మనతో పోలిస్తే ఏపీకి నిధులు ఎక్కువ ఇచ్చింది. ఈసారి ఏపీకి రూ.7,030 కోట్లు కేటాయించింది. అయితే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు ఉన్నాయా? లేదా? వందే భారత్‌ ట్రైన్స్‌ ఎన్ని? తదితర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో 16 కొత్త లైన్లు, డబ్లింగ్‌ ప్రాజెక్టుల (2,495 కి.మీ) పనులు నడుస్తున్నాయి. వీటికి మొత్తం రూ.31,281 కోట్లు ఖర్చు చేయనున్నారు. బడ్జెట్ లో ఈసారి కూడా పనులు నడుస్తున్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇచ్చారు. మునీరాబాద్‌‌ – మహబూబ్‌‌నగర్‌‌ (246 కి.మీ.)కు రూ.289 కోట్లు, మనోహరాబాద్‌‌ – కొత్తపల్లి (148.9 కి.మీ) రూ.162 కోట్లు, భద్రాచలం – సత్తుపల్లి (56.25 కి.మీ.) రూ.100 కోట్లు, అక్కన్నపేట్‌‌ – మెదక్‌‌ (17కి.మీ.) రూ. 41 కోట్లు కేటాయించారు. కాజీపేట – విజయవాడ (219.64 కి.మీ.)  థర్డ్‌‌ లైన్‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌కు రూ.592 కోట్లు, కాజీపేట – బల్లార్ష(201)కు  రూ.550 కోట్లు, సికింద్రాబాద్‌‌ –మహబూబ్‌‌నగర్‌‌ కు రూ.150 కోట్లు, విజయవాడ – కాజీపేట బైపాస్‌‌ లైన్‌‌కు రూ.352 కోట్లు అలోకేట్ చేశారు.

కొన్నింటిని పట్టించుకోలే.. 
రాష్ట్రంలోని కొన్ని మార్గాలకు మాత్రం నిధులే ఇవ్వలేదు. పెద్దపల్లి – కరీంనగర్‌‌– నిజామాబాద్‌‌ (177.49 కి.మీ.), మంచిర్యాల – నల్గొండ (92 కి.మీ.), జగ్గయ్యపేట – మేళ్లచెర్వు (19 కి.మీ.), భద్రాచలం– కొవ్వూరు (151 కి.మీ.), మణుగూరు – రామగుండం (200 కి.మీ.), కొండపల్లి – కొత్తగూడెం (125 కి.మీ.), గుంటూరు – బీబీ నగర్‌‌ (248 కి.మీ.) ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు.