మేడిగడ్డ బ్యారేజీ ఖాళీ!.. 10 టీఎంసీల నీళ్లు కిందికి విడుదల

మేడిగడ్డ బ్యారేజీ ఖాళీ!..  10 టీఎంసీల నీళ్లు కిందికి విడుదల
  • కుంగిన పిల్లర్లను పరిశీలించిన కేంద్ర బృందం
  • పగుళ్ల శాంపిల్స్, పిల్లర్ వద్ద మట్టి సేకరణ
  • రిపేర్లకు ఆరు నెలలు పట్టే చాన్స్

జయశంకర్‌‌ భూపాలపల్లి / మహాదేవ్‌‌పూర్‌‌, వెలుగు:   మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌‌లోని పిల్లర్లను మంగళవారం అనిల్‌‌ జైన్‌‌ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర జల సంఘం కమిటీ పరిశీలించింది. నిచ్చెన వేసుకొని మరీ కిందికి దిగిన అధికారులు దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించారు. సుమారు రెండు గంటల పాటు బ్యారేజీ వద్ద ఎంక్వైరీ చేశారు. రాష్ట్ర ఇరిగేషన్‌‌, ఎల్‌‌అండ్‌‌ టీ కంపెనీ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ ఖాళీ అయింది. 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కాళేశ్వరం వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ బంద్‌‌ అయింది. దెబ్బతిన్న బ్యారేజీ పిల్లర్స్‌‌ రిపేర్‌‌ అయ్యేంత వరకు కన్నెపల్లి పంప్‌‌హౌస్​ వద్ద  కాళేశ్వరం మోటార్లు నిలిపివేయనున్నట్లు తెలిసింది. సుమారు 6 నెలల పాటు రిపేర్‌‌ వర్క్‌‌ జరగనున్నట్లు సమాచారం. 

మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఆరుగురు ఇంజినీరింగ్ నిపుణులతో బృందం ఏర్పాటు చేసింది. బ్యారేజీని పరిశీలించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక పంపించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ డైరెక్టర్లు ఎస్ కే శర్మ, ఆర్ తంగమణి, రాహుల్ కె సింగ్, సీడబ్ల్యూసీ గోదావరి సర్కిల్‌‌ ఎస్‌‌ఈ దేవందర్‌‌ రావుతో పాటు ఇరిగేషన్‌‌ శాఖ మంచిర్యాల సీఈ వెంకటేశ్వర్లు సోమవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఉదయం10:30 గంటలకు కేంద్ర బృందం మేడిగడ్డ దగ్గర ఉన్న ఎల్ అండ్ టీ క్యాంపు ఆఫీస్‌‌కు చేరుకుంది. ఇక్కడ గంటన్నర పాటు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లతో మీటింగ్‌‌ నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా 12:10 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ పైకి చేరుకున్నారు. 7వ బ్లాక్‌‌లో భూమిలోకి కుంగిన 20 వ పిల్లర్‌‌ను పరిశీలించారు. నిచ్చెన వేసుకొని మరి కిందికి దిగి భూమిలోని సాయిల్‌‌ సేకరించారు. పగిలిన పిల్లర్‌‌ నుంచి రాలిపడిన సిమెంట్‌‌ ముక్కలను సేకరించి టెస్ట్‌‌ కోసం తీసుకెళ్లారు. 7వ బ్లాక్‌‌లో దెబ్బతిన్న 19, 21వ పిల్లర్లతో పాటు మహారాష్ట్ర వైపు ఉన్న బ్యారేజీ పిల్లర్లు అన్నింటినీ పరిశీలించారు. ఆ సమయంలోనే అక్కడ తేనేటీగలు లేవడంతో బ్యారేజీ పైకి చేరుకున్నారు. దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించే విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి లోకల్‌‌ ఇంజినీర్లకు ఆదేశాలిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్‌‌ చేరుకున్నారు. 

1000 మంది కూలీలతో పనులు‌ !

దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను రిపేర్‌‌ చేయడానికి సుమారు వెయ్యి మంది కార్మికులతో మరమ్మతు పనులు చేయించనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలన అనంతరం రాష్ట్ర ఇరిగేషన్‌‌ శాఖ రిపేర్‌‌ వర్క్‌‌లకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 7వ బ్లాక్‌‌లో కుంగిన 20, 21, 19 వ పిల్లర్ వద్ద నిల్వ ఉన్న నీళ్లను ఖాళీ చేసే పనులు ప్రారంభించనున్నారు. బుధవారం 20 మంది లేబర్లతో వర్క్ చేయపోతున్నట్లు సమాచారం అందింది. 20 టిప్పర్లు, 20 మిల్లర్లు రప్పించే యోచనలో ఎల్‌‌అండ్‌ టీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. మహారాష్ట్ర వైపు నుంచి 25వ పిల్లర్ వరకు రైలింగ్ తో కూడిన కరకట్టను ఏర్పాటు చేసి నీటిని మళ్లించి ఆ బ్లాక్ వద్ద పనులు చేయనున్నారు. గోదావరిలో నీళ్లను దిగువకు తరలించి, డ్యామేజ్ అయిన ప్రాంతంలో మరమ్మతు పనులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకుపోవడానికి మట్టి రోడ్డును కూడా వేస్తారు. ప్రస్తుతం గోదావరిలో వస్తున్న ఇన్‌‌ ఫ్లో వాటర్‌‌ను మళ్లించడానికి రింగ్‌‌ బండ్‌‌ కడతారు. ఆ తర్వాత దెబ్బతిన్న పిల్లర్లకు రిపేర్‌‌ వర్క్స్‌‌ పూర్తి చేస్తారని ఇంజినీర్ల సమావేశంలో చర్చలు జరిగినట్లుగా   తెలిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల‌ తర్వాత వచ్చె నెలలో సుమారు వెయ్యి మంది కార్మికులతో పనులు స్పీడ్‌‌ అప్‌‌ చేయనున్నారు. సుమారు ఆరు నెలల పాటు రిపేర్‌‌ వర్క్‌‌ జరిగే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌లు చెబుతున్నారు. బ్యారేజీ పిల్లర్లను రిపేర్‌‌ చేసి గేట్లు వేసి నీళ్లను నిల్వ చేసిన తర్వాతనే కన్నెపల్లి నుంచి కాళేశ్వరం వాటర్‌‌ లిఫ్టింగ్‌‌స్టార్ట్‌‌ అవుతుంది. అప్పటిదాకా మోటార్లు బంద్‌‌ చేసే ఉంచుతారు. 

5 ఫీట్ల లోతుకు కుంగిన పిల్లర్‌‌ ! 

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. శనివారం రాత్రి భారీ శబ్దంతో పిల్లర్లు కుంగిపోవడంతో ఇంజినీర్లు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఆదివారం సాయంత్రం కల్లా బ్యారేజ్ 3 ఫీట్ల వరకు కుంగిపోగా ఇప్పుడు మరో రెండు ఫీట్లు కుంగినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో ఫీటు వరకు కిందకు జారిపోతే పిల్లర్ పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఉండొచ్చని ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బయటకొచ్చిన ఫొటోలనుచూస్తే.. 7వ బ్లాక్‌‌లోని 20వ పిల్లర్‌‌(ఫియర్‌‌) పూర్తిగా దెబ్బతిన్నట్లు కన్పిస్తోంది. రోజు రోజుకు పిల్లర్‌‌పై ఏర్పడిన పగుళ్లు విస్తరిస్తుండటంతో స్ట్రక్చర్, డెక్ భాగాలు విడిపోతున్నట్టుగా చెబుతున్నారు. ఇనుప రాడ్లు సపోర్ట్ వేయడంతో పిల్లర్‌‌ కూలిపోకుండా అలాగే ఉందని సమాచారం.