రిక్రూట్మెంట్ల జాతర జరుగుతోంది : హరీష్ రావు

రిక్రూట్మెంట్ల జాతర జరుగుతోంది : హరీష్ రావు

ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మెట్ పల్లిలో నిర్మించనున్న ప్రభుత్వ దవాఖానాకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాకముందు మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రిలో ఏటా 200 ప్రసవాలు జరిగితే ప్రస్తుతం ఆ సంఖ్య 2వేలకు పెరిగిందని అన్నారు. 30 పడకల కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని 20 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు.

మెట్పల్లికి బస్తి దవాఖానా మంజూరు చేస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే ఏఎన్ఎం సబ్ సెంటర్ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మెట్పల్లి ఆసుపత్రిలో 73 శాతం సీ సెక్షన్లు చేస్తున్నారని.. కానీ 73 శాతం సాధారణ ప్రసవాలే జరగాలని తెలిపారు. గర్భిణులు తల్లిదండ్రులు సహజ ప్రసవాలకు మొగ్గు చూపాలని సూచించారు. నార్మల్ డెలివరీలతో మహిళలకు అన్ని విధాలుగా శ్రేయస్కరమని చెప్పారు.

తెలంగాణ వచ్చిన నాటి నుండి 1,42,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. కొత్తగా 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇస్తున్నామని..రాష్ట్రంలో రిక్రూట్మెంట్ల జాతర జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో వ్యవసాయ సాగుకు ప్రభుత్వం సమృద్దిగా జలాలు అందిస్తోందన్నారు. వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిన ఘనత సిఎం కేసిఆర్ కే దక్కుతుందన్నారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే.. ప్రస్తుతం 2 కోట్ల 48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని హరీష్ రావు తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్ సహా తెలంగాన ప్రభుత్వానికే ఉందన్నారు. త్వరలోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలిపారు.