టెర్రరిస్టుల దాడిలో 100 మంది మృతి

టెర్రరిస్టుల దాడిలో 100 మంది మృతి

నియమే (నైగర్): బుర్కినాఫాసో దేశంలోని ఓ గ్రామంలో  టెర్రరిస్టులు జరిపిన దాడిలో దాదాపు 100 మంది చనిపోయారు. సహెల్ యాఘ ప్రావిన్స్​లోని సోల్హాన్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆయుధాలతో కొందరు టెర్రరిస్టులు ప్రవేశించారు. దాదాపు రాత్రంతా వారు కాల్పులు జరిపారు. దాడికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. దీన్ని  అత్యంత ఘోరమైన దాడిగా ప్రభుత్వ ప్రతినిధి ఓస్సెనీ తంబౌర అభివర్ణించారు. జిహాదీల చర్యపై శనివారం ఆయన మండిపడ్డారు. దాడిలో దాదాపు100 మంది ప్రాణాలు కోల్పోయారని.. మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారు మృతుల్లో ఉన్నట్లు తెలిపారు. నైగర్ సరిహద్దు వైపున్న ప్రాంతంలో స్థానిక మార్కెట్​తో పాటు చాలా ఇండ్లు మంటల్లో కాలిపోయాయని చెప్పారు. టెర్రరిస్టుల దాడిపై ప్రెసిడెంట్ రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్​మాట్లాడుతూ.. ‘ఇది అనాగరిక చర్య. 2015 తర్వాత బుర్కినాఫాసోలో జిహాదీలు చేసిన అత్యంత ఘోరమైన దాడి ఇదే..’ అని చెప్పారు. మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.