క్వారెంటైన్‌‌ నుంచి బయటికెళ్లిండు.. వెయ్యి మందిని తోడు తెచ్చుకుండు

క్వారెంటైన్‌‌ నుంచి బయటికెళ్లిండు..  వెయ్యి మందిని తోడు తెచ్చుకుండు

బీజింగ్‌‌: చైనాలో ఓ వ్యక్తి చేసిన తప్పుకు 1,000 మంది క్వారెంటైన్‌‌ అవ్వాల్సి వచ్చింది. బీజింగ్‌‌కు చెందిన 40 ఏండ్ల వ్యక్తి క్వారెంటైన్‌‌ నుంచి తప్పించుకొని బయటికొచ్చిండు. ఇంటి చుట్టు పక్కల వారి ని కలిశాడు. షాపింగ్‌‌ చేశాడు. అతడిని పట్టుకొని టెస్ట్ చేయగా, కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ఆ తర్వాత అతడు ఉండేచోట 1,000 మందిని అధికారులు క్వారెంటైన్‌‌ చేశారు. అతని భార్యకు కూడా పాజిటివ్‌‌ రావడంతో, మరో 5 వేల మందిని ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు. అందులో 250 మందిని ప్రభుత్వ క్వారెంటైన్‌‌కు తరలించారు. క్వారెంటైన్‌‌ రూల్స్‌‌ బ్రేక్‌‌ చేసినందుకు ఆ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారు. మరోవైపు చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా అక్కడ 66 మందికి కరోనా నిర్ధారణ అయింది. బీజింగ్ లో మరో 12 మంది వైరస్ సోకినట్లు తేలింది. ఈనేపథ్యంలో జీరో కొవిడ్ పాలసీతో చైనా సర్కారు ముందుకుపోతోంది. కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు, పోలీసు కేసులతో కొరడా ఝుళిపిస్తోంది. జీరో కొవిడ్ పాలసీ వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షాంఘైలో దాదాపు రెండు నెలల పాటు అమలుచేసిన కఠిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే బందీలుగా మారి ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేస్తున్నాయి.